Reliance Market Cap | ఈక్విటీ మార్కెట్లలో పతనం.. టాప్ 100 కంపెనీలలోంచి రిలయన్స్ అవుట్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reliance Market Cap | ఈక్విటీ మార్కెట్లలో పతనంతో ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోతుండడమే కాకుండా కంపెనీల ర్యాంకులూ పడిపోతున్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా ప్రపంచంలోని టాప్ 100 లిస్టెడ్ కంపెనీల జాబితాలో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ఒక్క భారతీయ కంపెనీ కూడా లేకపోవడం గమనార్హం. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు ఎంతగా దెబ్బతీశాయో ఇది రుజువు చేస్తోంది.

Reliance Market Cap | అప్పట్లో మూడు కంపెనీలు..

2025 సంవత్సరం ప్రారంభం వరకు మూడు భారతీయ కంపెనీలు ప్రపంచంలోని టాప్ 100 లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఉండేవి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్‌లకు ఈ జాబితాలో చోటు ఉండేది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఈక్విటీ మార్కెట్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. 2025 ప్రారంభంలో దేశంలో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్లోబల్ జాబితాలో 57వ స్థానంలో ఉండగా.. 2026 ప్రారంభంలో 73వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 106వ స్థానంలో ఉంది.
భారతదేశంలో అత్యంత విలువైన బ్యాంక్‌లలో ఒకటి అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 2025 ప్రారంభంలో 97వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు సగానికి తగ్గి 190వ స్థానంలో కొనసాగుతోంది. 2025 ప్రారంభంలో 84వ స్థానంలో ఉన్న టీసీఎస్ .. 2026 ప్రారంభానికి 171వ స్థానానికి దిగజారింది. ప్రస్తుతం 314వ స్థానంలో ఉంది.

Reliance Market Cap | ఇతర కంపెనీలదీ అదే పరిస్థితి..

భారతీ ఎయిర్‌టెల్ 2026 ప్రారంభంలో 164వ స్థానం ఉండగా.. ఇప్పుడు 202వ స్థానానికి పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 215 నుంచి 274కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 231 నుంచి 276వ స్థానానికి పడిపోయాయి. భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ 2026 ప్రారంభంలో 330వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 590వ స్థానానికి ఐటీసీ 466 నుంచి 702వ స్థానానికి క్షీణించాయి.

Reliance Market Cap | టాప్ 500లో తొమ్మిది కంపెనీలే..

మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల జాబితాలో 2025 ప్రారంభంలో 15 భారతదేశపు కంపెనీలు ఉండేవి. 2026 ప్రారంభంలో ఈ సంఖ్య 13 కు, ప్రస్తుతం తొమ్మిదికి పడిపోయింది.

Reliance Market Cap | ఆ క్లబ్‌లో మూడే కంపెనీలు..

100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరు కాగా.. ప్రస్తుతం అది సగానికి తగ్గి మూడుగా ఉంది. రిలయన్స్, ఎయిల్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 198 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా.. 124 బిలియన్ డాలర్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో, 113 బిలియన్ డాలర్లతో భారతి ఎయిర్‌టెల్ మూడో స్థానంలో నిలిచాయి.

ఇది కూడా చదవండి..: Airtel Market Cap | ఎయిర్‌టెల్ పైపైకి.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *