అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu CM Vijay | తమిళనాడులో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ నటుడు జోసెఫ్ విజయ్ పార్టీ టీవీకే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలలో సత్తా చాటిన విషయం తెలిసిందే. పూర్తి మెజారిటీ సాధించకపోయినా అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్టీ పెట్టిన కొద్ది సంవత్సరాల్లోనే అధికారంలోకి తీసుకురావడంతో విజయ్ పేరు సోషల్ మీడియా (Social Media)లో మారుమోగిపోతోంది.
ఫేక్ కథనాలు, అతిశయోక్తులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాన తన మార్క్ ఏమీ చూపకపోయినా ఆహా.. ఓహో అంటూ ఆయా సామాజిక మాధ్యమాలలో ఊదరగొడుతున్నారు. అయితే ఈ అభిమానం హద్దుమీరుతుండడంతో ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) అభాసుపాలు కావాల్సి వస్తోంది.
Tamil Nadu CM Vijay | ఒక్కరికే టికెట్టు..
అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనరల్ సీట్లలోనూ భారీగా షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిందని, ఇందులో పలువురు గెలిచారని పోస్టులు పెడుతున్నారు. అయితే వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. టీవీకే జనరల్ సీట్లలో ఒకేఒక్క ఎస్సీ అభ్యర్థికి టికెట్టు ఇచ్చిందని, ఆ అభ్యర్థీ ఓటమి పాలయ్యారని అధికారిక డేటా చెబుతోంది.
Tamil Nadu CM Vijay | గెలిచింది 107.. లెక్కపెడితే 126..
టీవీకే విద్యాధికులకే ఎక్కువ టికెట్లు ఇచ్చిందని, ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఉన్నత విద్యాభ్యాసం చేసినవారని ప్రచారం జరుగుతోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఆరుగురు పీహెచ్ డీ పూర్తి చేశారని, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లని, ఐదుగురు ఐఐటీ ఇంజినీర్లని, ఎనిమిది మంది ఎంబీబీఎస్ డాక్టర్లని, 40 మంది లాయర్లు, ఇంజినీర్లు అని, 25 మంది గ్రాడ్యుయేట్లని,12 మంది 12 క్లాస్ పాస్ అయ్యారని, ఎనిమిది మంది పదో తరగతి చదివారని పోస్టులు పెడుతున్నారు. ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తోంది. కానీ టీవీకే గెలిచింది 107 సీట్లే కావడం గమనార్హం.
Tamil Nadu CM Vijay | ‘విజయ్ యుగం’లో మహిళలకు ప్రాధాన్యత..
తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టింది. విజయ్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని ఇచ్చారు అని అభిమానులు ఓ కథనం అల్లారు. ఇది కూడా పూర్తి అబద్ధం. గతంలో ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రుగానే మహిళలున్నారు. జయలలిత, జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాగే పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా అభిమానులు విజయ్ ప్రవేశ పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు విజయ్ విశ్వసనీయతను దెబ్బతీస్తాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి..: Sapta Jyotirlinga Tour | ఆధ్యాత్మిక యాత్రకు ఐఆర్‌సీటీసీ తోడు.. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ పేరిట టూర్ ప్యాకేజీ


