అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Employee Salary Cut | పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కారు. తామకు నచ్చినప్పుడు వస్తారు. ఇలాంటి వారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలా ఆలస్యంగా వచ్చే వారి జీతాల్లో కోత విధించాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
కలెక్టరేట్లోని పలు విభాగాలను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను పరిశీలించి సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆ సమయంలో పలువురు అధికారులు కార్యాలయానికి హాజరు కాకపోవడాన్ని గమనించారు. ఖాళీగా ఉన్న సీట్లపై అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ సరైన కారణాలు లేకుండా ఆలస్యంగా విధులకు హాజరైన సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈరోజు జీతంలో కోత విధించాలని ఆదేశించారు.
Employee Salary Cut | గైర్హాజరుగా నమోదు చేయాలి
ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తారని, వారికి సేవలు అందించాల్సిన అధికారులు ఆలస్యంగా వస్తే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు. అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : New Cars Burnt | కంటైనర్‌లో మంటలు.. 10 కొత్త కార్లు దగ్ధం


