అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids on Deputy Collector | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన అధికారి ఇంట్లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ (Deputy Collector Vamsi Mohan) ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.
డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు చెందిన 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. వంశీమోహన్‌కు చెందిన రూ.వందల కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ACB Raids on Deputy Collector | ఆర్డీవోగా పని చేసిన సమయంలో..
వంశీమోహన్ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఆర్డీవో (RDO)గా పని చేశారు. ఆ సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని ఆయన కాజేసినట్లు సమాచారం. సదరు భూమిని మొదట తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి.. తర్వాత ఓ రియల్టర్‌కు కట్టెబట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి వంశీమోహన్ 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్‌గా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raids on Deputy Collector | ఏసీబీ దూకుడు
ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. ఓ వైపు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇటీవల జలమండలి జీఎం ఇంట్లో సోదాలు జరిపి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
దీనిని కూడా చదవండి : ADE Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ


