అక్షరటుడే, ఆర్మూర్: Alumni Reunion | ఆర్మూర్ మండలం చేపూర్ జడ్పీహెచ్ఎస్ (Chepur ZPHS) పూర్వ విద్యార్థులు 35ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒక చోట కలుసుకున్నారు. ఈ అపూర్వ కలయికకు చేపూర్‌లోని గురడి రెడ్డి కళ్యాణమండం వేదికగా నిలిచింది.
Alumni Reunion | ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు..
ఆర్మూర్(Armoor) మండపంలోని చేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం(Friendship Reunion) ఆదివారం నిర్వహించారు. సుమారు 35ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపైకి చేరి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది వరకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను, క్లాస్‌రూమ్‌లో అల్లర్లను, గురువులు బోధించిన విద్యావిధానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన మిత్రులంతా ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.
Alumni Reunion | అనాటి గురువులకు సన్మానం..
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మాజీ గెజిటెడ్ హెచ్ఎం బుచ్చయ్య, అంజయ్య, రఘోతం రెడ్డితో పాటు ముగ్గురు గంగాధర్‌లు.. ఇలా మొత్తం 16 మంది గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి పూర్వ విద్యార్థులు గురుదక్షిణగా దుస్తులు అందించి, పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
Alumni Reunion | తోటి విద్యార్థినులను ఆడపడుచులుగా భావించి..
ఆత్మీయ సమ్మేళనంలో ఒక వినూత్న సాంప్రదాయానికి తెరలేపారు. తోటి విద్యార్థినులను తమ సొంత ఆడపడుచులుగా భావించి, ఆ బ్యాచ్‌లోని మహిళలకు, వారి భర్తలకు పూర్వ విద్యార్థులు నూతన వస్త్రాలను బహుకరించి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులైన టీఎన్జీవో (TNGO) జిల్లా మాజీ అధ్యక్షుడు, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీనుగు రాజేశ్వర్, ఉపాధ్యాయుడు తోపారం కిషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్ గంజి చంద్రశేఖర్, రైల్వే శాఖ(Railway Department) హెల్త్ అసిస్టెంట్(పూణె) శ్రీనివాస్ శంకర్, శ్రీనివాస్, గంగాధర్, నర్సయ్య రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
