అక్షరటుడే వెబ్‌డెస్క్: AMCA Fighter Jet | భారత రక్షణ రంగ చరిత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రోటోటైప్స్ తయారీ బిడ్డింగ్ నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వెలుపలకి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని సాంకేతిక నిబంధనలను పూర్తి చేయడంలో హెచ్‌ఏఎల్ విఫలమవ్వడంతో ఈ ప్రాజెక్ట్ రేసు నుంచి అర్హత కోల్పోయినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
AMCA Fighter Jet | ప్రైవేట్ రంగానికి పెద్దపీట..
దేశంలో ఫైటర్ జెట్ల తయారీ కోసం ఒకే సంస్థపై ఆధారపడే పరిస్థితిని మార్చాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండో ఫైటర్ జెట్ తయారీ లైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో కేవలం మూడు సంస్థల కన్సార్టియంలు మాత్రమే సాంకేతిక, ఆర్థిక అర్హత సాధించాయి. మిగతా చిన్న సంస్థలతో కలిసి బిడ్ దాఖలు చేసిన హెచ్‌ఏఎల్ అర్హత సాధించలేకపోవడంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్‌అండ్‌టీ-బీఈఎల్-డైనమాటిక్ కన్సార్టియం, భారత్ ఫోర్జ్-బీఈఎంఎల్-డేటా ప్యాటర్న్స్ సంస్థలు తుది పోటీలో నిలిచాయి.
AMCA Fighter Jet | రూ. 15,000 కోట్ల భారీ ప్రాజెక్ట్..
సుమారు రూ. 15,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రోటోటైప్ దశకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. బిడ్ దక్కించుకున్న సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి వద్ద ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) తో కలిసి 5 ఫ్లయింగ్ ప్రోటోటైప్‌లు, ఒక స్ట్రక్చరల్ టెస్టింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ విమానాలకు తొలి దశలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ జీఈ-ఎఫ్414 (GE-F414) ఇంజిన్లను ఉపయోగించనున్నారు.
AMCA Fighter Jet | దేశ భద్రతకు..
డ్రాగన్ దేశం చైనా ఇప్పటికే 500కు పైగా జె-20 (J-20), జె-35 (J-35) రకం ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను సైన్యంలో చేర్చుకుంది. అంతేకాకుండా వీటిని పాకిస్తాన్ వైమానిక దళానికి కూడా అందించే అవకాశం ఉందనే హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం (IAF) పటిష్టత కోసం సొంతంగా ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసుకోవడం దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Kamareddy Vote Theft Protest | జ్ఞానేశ్ కుమార్‌ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి