అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anantha Babu Absconding | వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై తాజాగా మరో కేసు నమోదవడం సంచలనంగా మారింది.
Anantha Babu Absconding | అక్కడి నుంచి పరారీ
మంగళవారం రాత్రి కాకినాడ (Kakinada)లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా, అప్పటికే ఆయన అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఇంటి వద్ద కారు, గన్‌మెన్ ఉన్నప్పటికీ… ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులో తమకు అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ డబ్బు ఆఫర్ చేసి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Anantha Babu Absconding | పోలీసులు వస్తున్నారని తెలిసి…
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) మంజూరు చేసిన బెయిల్‌పై ఆయన ప్రస్తుతం బయట ఉన్నారు. అయితే సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని అప్పుడే సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా… అంతకు ముందు ఈ కొత్త కేసు నమోదవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
పోలీసుల సమాచారం మేరకు, మంగళవారం రాత్రి పోలీసులు ఆయన ఇంటికి చేరుకునేలోపే అనంతబాబు పరిస్థితిని పసిగట్టి మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు త్వరలోనే అనంతబాబును అదుపులోకి తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. Chandrababu Comments | రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

