అక్షరటుడే వెబ్‌డెస్క్: Auto Fare Hike | తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఆటోరిక్షా ప్రయాణ ఛార్జీల సవరణకు సంబంధించి ప్రభుత్వం నూతన నిబంధనలు , కొత్త రుసుముల వివరాలను ఖరారు చేసింది. ఆటో డ్రైవర్ల నిర్వహణ వ్యయం, పెరుగుతున్న ఖర్చులతో పాటు ప్రయాణికులపై పడే భారాన్ని సమతుల్యం చేస్తూ ఈ కొత్త టారిఫ్‌ను తీసుకువచ్చారు.
Auto Fare Hike | కొత్త ఛార్జీల వివరాలు..
నూతన నిబంధనల ప్రకారం ఆటో ప్రయాణంలో తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీగా రూ. 30 నిర్ణయించారు. ఆ తర్వాత ప్రయాణించే ప్రతి అదనపు కిలోమీటరుకు రూ. 14 చొప్పున వసూలు చేయనున్నారు. అలాగే, ప్రయాణంలో ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల ఆటో ఆగిపోయినప్పుడు వర్తించే వెయిటింగ్ ఛార్జీలను నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు.
Auto Fare Hike | రాత్రి వేళల్లో అదనపు ఛార్జీలు..
రాత్రి సమయాల్లో ప్రయాణించే వారికి ప్రత్యేక ఛార్జీల విధానం వర్తిస్తుంది. రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల మధ్య తిరిగే ఆటోలకు సాధారణ ఛార్జీ కంటే ఒకటిన్నర రెట్లు (1.5 రెట్లు) అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక లగేజీ విషయానికి వస్తే.. చిన్న తరహా బ్రీఫ్‌కేస్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, 60×40 సెంటీమీటర్ల కంటే తక్కువ కొలతలు ఉన్న బ్యాగులకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అయితే వీటి కంటే పెద్దగా ఉండే ప్రతి ప్యాకేజీకి రూ. 0.50 పైసల చొప్పున లగేజీ ఛార్జీ చెల్లించాలి. ఒక ఆటోలో గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు మాత్రమే లగేజీకి అనుమతి ఉంటుంది.
Auto Fare Hike | డిజిటల్ మీటర్ల రీసెట్టింగ్ నిబంధనలు..
ఈ కొత్త టారిఫ్‌కు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లలో మార్పులు చేయాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రయాణం ప్రారంభంలో మీటర్ ఆన్ చేయగానే కనీస ఛార్జీ రూ. 30 పడాలి. తొలి 1.6 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత, ప్రతి 100 మీటర్లకు (1/10వ కిలోమీటరు) రూ. 1.40 చొప్పున మీటర్‌లో ఛార్జీ పెరిగేలా టెక్నికల్ సెట్టింగ్ మార్చుకోవాలి. ప్రయాణికులకు పారదర్శకమైన సేవలు అందించేందుకే ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Banswada Theft Case | బెయిల్ కోసం అప్పులు.. వాటిని తీర్చేందుకు చోరీల బాట..