అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ayodhya Trust Corruption | అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అనుచరులను యూపీ సిట్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సేకరించిన విరాళాలలో రూ. 200 కోట్ల భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరుల మనోభావాలను దెబ్బతీసే అంశమన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Ayodhya Trust Corruption | అధికారులను తొలగించడం సరిపోదు
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నప్పటికీ, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పోలీసుల ఇటీవలి చర్యలు భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సిట్ పోలీసులు చంపత్ రాయ్ సన్నిహితులను అరెస్టు చేశారన్నారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను వారి పదవుల నుంచి తొలగించడం ద్వారా చేతులు దులుపుకోవడం ఏమాత్రం సరిపోదని తెలిపారు.
Ayodhya Trust Corruption | దేవుడి కోసం ఇచ్చారు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారని చామల అన్నారు. ప్రజలు దేవుడి కోసం డబ్బు ఇచ్చారు తప్ప, మీరు దోచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేయడానికి, ప్రతిపక్ష ఎంపీలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శ్రీరాముడి పేరుతో సేకరించిన కోట్ల కొద్దీ నిధుల అసలు వినియోగం గురించి భారత ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Vi Spotify Partnership | వీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్..స్పాటిఫై ప్రీమియం ఇక ఉచితం