అక్షరటుడే వెబ్‌డెస్క్: Bangladesh Political Violence | బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ హింస, అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ( Sheikh Hasina )చెందిన నిషేధిత పార్టీ అవామీ లీగ్ పిలుపునిచ్చిన ‘లాక్‌డౌన్’కు ముందే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా రాజధాని ఢాకాలో పలుచోట్ల నాటు బాంబులు పేలడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలోని మొత్తం 64 జిల్లాల్లో దాదాపు 28 జిల్లాల్లో డజన్ల కొద్దీ బాంబు పేలుళ్లు సంభవించగా, పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
Bangladesh Political Violence | యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు..
గత రెండు రోజులుగా సిల్హెట్, రాజ్‌షాహి, బారిసాల్, ఫరీద్‌పూర్ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత మహ్మద్ యూనస్‌కు చెందిన ‘గ్రామీణ బ్యాంక్’ శాఖలపై దుండగులు దాడులు చేసి పలు బ్రాంచీలకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా చిట్టగాంగ్‌లోని పాంచ్‌లైస్ ప్రాంతంలో ఉన్న మహ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని కూడా గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. మరోవైపు, ప్రధాని తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యకర్తలు ఢాకాలోని ఇద్దరు అవామీ లీగ్ నేతల ఇళ్లపై రాత్రికి రాత్రే దాడి చేసి నిప్పంటించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ అల్లర్లలో ఢాకాలో కనీసం నలుగురికి గాయాలయ్యాయి. పశ్చిమ నరైల్ జిల్లాలో బీఎన్‌పీ చేపట్టిన ర్యాలీపై అవామీ లీగ్ కార్యకర్తలు దాడి చేయడంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫరీద్‌పూర్, పిరోజ్‌పూర్ ప్రాంతాల్లో ఒక బీఎన్‌పీ నేతతో పాటు ఒక రవాణా శాఖ ఉద్యోగి మృతి చెందారు.
Bangladesh Political Violence | ఈ ఘర్షణలకు కారణమిదే..
2024 ఆగస్టు 5న జరిగిన విద్యార్థుల ఉద్యమం తర్వాత పదవి కోల్పోయిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది ప్రత్యేక ట్రిబ్యూనల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో హసీనాకు మరణశిక్ష విధించింది. ఆ తీర్పు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అవామీ లీగ్ ఈ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. అయితే, మరణశిక్ష ఉన్నప్పటికీ డిసెంబర్‌లో ఏదేమైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని హసీనా ఈ నెల ప్రారంభంలో ప్రకటించడంతోనే అక్కడ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మంగళవారం ఆమె స్వస్థలం తుంగిపారాలో దాదాపు 30 మంది మద్దతుదారులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు స్టేషన్ ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Bangladesh Political Violence | ప్రధాని తారిక్ రెహమాన్ తీవ్ర స్పందన..
ఈ పరిణామాలపై ప్రధాని తారిక్ రెహమాన్ పార్లమెంట్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అవామీ లీగ్‌ను ఒక ‘ఉగ్రవాద సంస్థ’గా, ‘ఓడిపోయిన ఫాసిస్ట్ శక్తి’గా అభివర్ణించిన ఆయన.. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని, 2024 నాటి స్ఫూర్తితో నియంతృత్వ శక్తులను మరోసారి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడకుండా, ఎంపీలందరూ రోడ్లపైకి వచ్చి పరిస్థితిని ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు ‘ది డైలీ స్టార్’ పత్రిక పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. హసీనా జన్మస్థలమైన గోపాల్‌గంజ్ సహా సున్నితమైన జిల్లాల్లో వేలాది మంది ‘బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్’ (BGB) పారామిలిటరీ బలగాలను మోహరించారు. గడిచిన 24 గంటల్లో ఒక్క ఢాకాలోనే పోలీసులు 565 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో హసీనా కేబినెట్‌లో మాజీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నూరుల్ ఇస్లాం నహిద్ కూడా ఉన్నారు. ఆడియో, వీడియో ఆధారాల ప్రకారం అల్లరిమూకలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ హామీ ఇచ్చారు.
2024లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ హయాంలో అవామీ లీగ్‌పై నిషేధం విధించడంతో పాటు, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని, 1971 విముక్తి పోరాట స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే హింస మరో కొత్త రూపంలో దేశాన్ని కుదిపేస్తోంది.
ఇది కూడా చదవండి: Arunachalam Tour Package | ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక రైళ్లు