అక్షరటుడే, కామారెడ్డి: Bank Security Measures | బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో బ్యాంకర్లు భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు, ఆభరణాల చోరీల నివారణకు బ్యాంకు అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
Bank Security Measures | ఆర్థిక నేరాలను అరికట్టేందుకు..
ఈ సందర్భంగా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు, దోపిడీలు, సైబర్, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు.
ప్రజలు నమ్మకంతో బ్యాంకుల్లో దాచుకున్న కష్టార్జిత సొమ్ముకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి బ్యాంకు శాఖ, ఏటీఎం కేంద్రంలో అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేసే ఆధునిక అలారం వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నిరంతర నిఘా ఉండేలా శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు.
ఏటీఎంలలో నగదు చోరీకి ప్రయత్నించినప్పుడు నోట్లపై సిరా చల్లి వాటిని నిరుపయోగం చేసే ఇంక్ స్ప్రెడర్ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేసేటప్పుడు జనసంచారం ఉండే సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని, రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా పటిష్టమైన లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.
Bank Security Measures | రహస్య కెమెరాలతో పటిష్టమైన నిఘా..
బ్యాంకులు, ఏటీఎంల లోపల, బయట హైరిజల్యూషన్ సీసీ కెమెరాలతో పాటు రహస్య కెమెరాలను ఏర్పాటు చేయాలని, కెమెరాలను ధ్వంసం చేసినప్పటికీ నేరస్థుల ఆనవాళ్లు గుర్తించేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
బ్యాంకుల నుంచి ఏటీఎంలకు నగదు తరలించే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని, నగదు రవాణా సమయంలో తగిన భద్రత, పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బ్యాంకు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఖాతాదారుల సొమ్ము భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
బ్యాంకులు, ఏటీఎంల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించరాదని, సూచించిన భద్రతా ప్రమాణాలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. భద్రతా చర్యల అమలులో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డిఎస్పీ గట్టుమల్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: #DNK ప్రీమియర్ షో చూసిన సుష్మిత శెట్టి