అక్షరటుడే, వెబ్డెస్క్ : Fox Sagar Lake | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా (Hydraa).. పలు చెరువులకు పూర్వ వైభవం తీసుకు వస్తోంది. వాటిలో పూడిక తొలగించి పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంట, నల్లకుంట, తుమ్మిడికుంటలను పునరుద్ధరించి ప్రారంభించింది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ పనులను ప్రారంభించింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. చెరువులో ఆక్రమణలు, పూడిక తొలగించనున్నారు. ఈ చెరువును మినీ రిజర్వాయర్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. చెరువులో పరిశ్రమల వ్యర్థాలు, మురుగు నీరు చేరాయి. పెద్ద మొత్తంలో పూడిక పేరుకుపోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Fox Sagar Lake | 5 మీటర్ల మేర పూడిక
ఫాక్స్ సాగర్ చెరువులో 5 మీటర్ల మేర పూడికను తొలగించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువులోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు నేరుగా చేరకుండా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. చెరువులోకి వరద నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ చెరువును 1897లో నిజాం పాలకుల కాలంలో నిర్మించారు. చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ఈ చెరువుకు పూర్వ వైభవం తెస్తామని రంగనాథ్ తెలిపారు.
దీనిని కూడా చదవండి : Traffic Restrictions | రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు