Bhadradri Accident | కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన రోడ్డు ప్రమాదం.. కోమాలో తల్లిదండ్రులు, అన్నకు అంత్యక్రియలు చేసిన చెల్లెలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhadradri Accident | భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒకే ప్రమాదం ఆ కుటుంబ ఆనందాన్ని క్షణాల్లో ఛిద్రము చేయగా, జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.

కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీశ్‌, స్వప్న దంపతులు తమ ఇద్దరు పిల్లలు మనోహర్‌ (19), మాధురితో కలిసి జీవిస్తున్నారు. కుటుంబం సంతోషంగా సాగుతుండగా విధి ఒక్కసారిగా వారి జీవితాలను మార్చేసింది. ఇప్పటికే గతంలో జరిగిన ప్రమాదంలో సతీశ్ త‌ల‌కు గాయం కాగా, వైద్య పరీక్షల నిమిత్తం భార్య స్వప్న, కుమారుడు మనోహర్‌తో కలిసి ఆటోలో భద్రాచలం బయల్దేరారు.

Bhadradri Accident | కుటుంబం మొత్తం విషాదంలోనే..

అయితే బూర్గంపహాడ్ మండలం (Burgampahad Mandal) కోయగూడెం సమీపానికి చేరుకున్న సమయంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కుమారుడు మనోహర్ మృతి చెందాడు. మరోవైపు తల్లిదండ్రులు సతీశ్‌, స్వప్న తీవ్ర గాయాల కారణంగా కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా చెల్లెలు మాధురి పరిస్థితి అందరినీ కదిలించింది. తల్లిదండ్రులు కోలుకుని వస్తారనే ఆశతో తన అన్న మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఫ్రీజర్‌లో ఉంచి ఎదురుచూసింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో చివరకు బంధువులు, గ్రామస్థుల సహకారంతో కన్నీటి నడుమ తన అన్నకు అంత్యక్రియలు నిర్వహించింది.

Bhadradri Accident | కళ్ల ముందే కుటుంబం ఇలా విషాదంలో

తన కళ్ల ముందే కుటుంబం ఇలా విషాదంలో కూరుకుపోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా అన్నకు తానే చివరి వీడ్కోలు పలకాల్సి రావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, తల్లిదండ్రులు కోలుకోవాలని గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Krishna River Barrage | కృష్ణానదిపై తెలంగాణ-కర్ణాటక సంయుక్త ప్రాజెక్టు.. కొత్త బ్యారేజీ, వంతెన నిర్మాణానికి కీలక అడుగులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *