Bird Flu Vaccine India | బర్డ్ ఫ్లూకు స్వదేశీ టీకా సిద్ధం.. నవంబర్ 20న లాంఛ్..

దేశవ్యాప్తంగా కోళ్ల పెంపకందారులకు ప్రతి ఏటా తీవ్ర ఆర్థిక నష్టాలను, ఆందోళనను కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) నియంత్రణకు తొలి స్వదేశీ టీకా సిద్ధమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bird Flu Vaccine India | దేశవ్యాప్తంగా కోళ్ల పెంపకందారులకు ప్రతి ఏటా తీవ్ర ఆర్థిక నష్టాలను, ఆందోళనను కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) నియంత్రణకు తొలి స్వదేశీ టీకా సిద్ధమైంది. భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. H5N1 వైరస్ బారి నుంచి కోళ్లను కాపాడే ఈ టీకాను నవంబర్ 20న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.

Bird Flu Vaccine India | క్లేడ్ 2.3.2.1a’ రకాన్ని లక్ష్యంగా..

కోళ్లలో తీవ్రమైన అనారోగ్యానికి, అధిక మరణాలకు కారణమయ్యే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ను అడ్డుకునేలా ఈ ఇనాక్టివేటెడ్ (Inactivated) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా దేశంలో వ్యాప్తి చెందుతున్న H5N1 వైరస్‌లోని ‘క్లేడ్ 2.3.2.1a’ రకాన్ని లక్ష్యంగా చేసుకుని దీనిని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఈ ప్రత్యేక రకం వైరస్‌పై పోరాడేందుకు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న టీకాలు లేకపోవడంతో, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ వ్యాక్సిన్ పౌల్ట్రీ రంగానికి కీలక రక్షణగా నిలవనుంది.

Bird Flu Vaccine India | పౌల్ట్రీ రంగానికి వేల కోట్ల నష్టం..

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందితే ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటంతో పాటు, వ్యాధి విస్తరణను అరికట్టేందుకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లను కూడా భారీ స్థాయిలో వధించాల్సి వస్తోంది. దీనివల్ల గుడ్లు, చికెన్ సరఫరా, ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడి ఎగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 2006లో దేశంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు H5N1, H5N8 ఉపరకాలకు సంబంధించి 500కు పైగా వ్యాప్తి ఘటనలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

Bird Flu Vaccine India | పొంచి ఉన్న ముప్పు..

బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకే పరిమితం కాకుండా, కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం 2003 నుంచి వివిధ దేశాల్లో మానవులకు H5N1 వైరస్ సోకిన కేసులు వెలుగుచూశాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. ఇటీవల క్షీరదాలతో పాటు ఇతర జంతు జాతుల్లోనూ ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన రేపుతున్న నేపథ్యంలో, వ్యాధిని ప్రాథమిక దశలోనే నియంత్రించడం అత్యవసరంగా మారింది.

Bird Flu Vaccine India | పౌల్ట్రీ రైతులకు భారీ ఊరట..

దేశంలో లక్షలాది కుటుంబాలకు కోళ్ల పెంపకం ప్రధాన జీవనాధారంగా ఉంది. విదేశీ వ్యాక్సిన్‌లపై ఆధారపడకుండా దేశీయంగానే రూపొందించిన ఈ టీకా వల్ల ఫారాల్లో మరణాల రేటు తగ్గి, రైతుల ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నవంబర్ 20న ఈ టీకా ప్రారంభోత్సవం అనంతరం, దీని వాణిజ్య ఉత్పత్తి , క్షేత్రస్థాయి వినియోగానికి సంబంధించిన తదుపరి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  Harish Rao | పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *