అక్షరటుడే వెబ్‌డెస్క్: TGSRTC Special Buses | రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ ( Telangana )రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అదనపు భారం మోపుతోంది. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని స్పెషల్ బస్సుల పేరుతో సాధారణ రోజుల కంటే దాదాపు 50 శాతం మేర ఎక్స్‌ట్రా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TGSRTC Special Buses | నిబంధన పేరుతో దోపిడీ..
తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తాయనే కారణంతో ఆర్టీసీ యాజమాన్యం ‘1.50’ నిబంధనను అమలు చేస్తోంది. దీనివల్ల పండుగ వేళ ప్రయాణికులకు తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఉదాహరణకు, హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు సాధారణ రోజుల్లో మెట్రో డీలక్స్ లేదా రాజధాని బస్సు చార్జీ రూ.290 ఉండగా, ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రతి టికెట్‌పై రూ.100 నుండి రూ.150 వరకు అదనంగా బాదేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
TGSRTC Special Buses | బస్సు ఎక్కాక కండక్టర్ల షాక్..
టికెట్ కౌంటర్లు లేదా బస్టాండ్లలో ముందస్తుగా ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా, ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత మార్గమధ్యంలో అదనపు చార్జీలు చెల్లించాలని కండక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా బస్సు ఎక్కాక ఎక్కువ డబ్బులు అడిగితే ఎలా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TGSRTC Special Buses| జర్నలిస్టుల పాసులకు నిరాకరణ.
మరోవైపు, స్పెషల్ బస్సుల్లో నిబంధనలు సరిగా అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. స్టేట్, జిల్లా జర్నలిస్టులకు వర్తించాల్సిన 1/3 వంతు రాయితీ (కాన్సెషన్) రూల్‌ను ఈ బస్సుల్లో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని సమాచారం.
మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండటంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కుటుంబాలతో వెళ్లే పురుషులు, సాధారణ ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. వేరే దారి లేక స్పెషల్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులపై ఆర్టీసీ ఈ విధంగా అదనపు చార్జీల మోత మోగిస్తోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ : కవిత