PDS Rice Scam | పేదల బియ్యానికి ‘పాలిష్‌’ దందా.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా!

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్ : PDS Rice Scam | పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం.. దళారుల చేతులు మారి మిల్లులకు, అక్కడి నుంచి బ్రాండెడ్‌ ముసుగులో బహిరంగ మార్కెట్‌కు తరలిపోతోంది.

సన్నబియ్యంలో నూకలు ఎక్కువగా ఉండటం, నాణ్యత లోపాల కారణంగా కొందరు లబ్ధిదారులు కిలో రూ.12 నుంచి రూ.20 చొప్పున దళారులకు విక్రయిస్తుండగా.. వ్యాపారులు వాటికి పాలిష్‌ పట్టించి రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

PDS Rice Scam | జిల్లాలో తాజాగా 77 కేసులు నమోదు..

జిల్లాలో మొత్తం 4,77,780 రేషన్‌ కార్డులు ఉండగా, 16,09,447 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం అందిస్తున్నారు. వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయగా, మూడు నెలలకు కలిపి ఏకంగా 30,130 మెట్రిక్‌ టన్నుల బియ్యం లబ్ధిదారులకు చేరింది. అయితే, బియ్యంలో నూకలు అధికంగా ఉండటం, వండిన తర్వాత నాణ్యత తక్కువగా ఉండటంతో కొందరు లబ్ధిదారులు దీన్ని వినియోగించకుండా బయట విక్రయిస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో జిల్లాలో రూ.1.40 కోట్ల విలువైన బియ్యం పట్టుబడగా, 77 కేసులు నమోదు కావడం దందా తీవ్రతకు అద్దం పడుతోంది.

PDS Rice Scam | బ్రాండెడ్‌ ముసుగులో దోపిడీ..

గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న బియ్యాన్ని వ్యాపారులు మిల్లుల్లో పాలిష్‌ చేయించి, ఇతర రకాలతో కలిపి బ్రాండెడ్‌ పేర్లతో ప్యాకింగ్‌ చేస్తున్నారు. అక్టోబరు 29న హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ బాగోతం బయటపడింది. కేవలం చిల్లర దుకాణాలపై దాడులకే పరిమితం కాకుండా.. గ్రామాల్లో బియ్యం సేకరణ నుంచి మిల్లుల్లో పాలిష్‌, ప్యాకింగ్‌ వరకు సాగుతున్న ఈ రీసైక్లింగ్‌ గొలుసును పూర్తిగా ఛేదించాల్సిన అవసరం ఉంది.

PDS Rice Scam | నిజామాబాద్‌లో గుట్టురట్టు.. అధికారి సస్పెన్షన్‌

నిజామాబాద్‌ జిల్లా (Nizamabad District)లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది. సెప్టెంబరు 1న నగరంలోని మిర్చి కాంపౌండ్‌లోని ఓ రవాణా సంస్థ నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 100 క్వింటాళ్ల (400 బస్తాలు) ప్రభుత్వ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలోనూ ఇటీవల పోలీసులు భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం, మిల్లర్ల పర్యవేక్షణలో లోపాలపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో) కె.శ్రీకాంత్‌రెడ్డిని కమిషనర్‌ అక్టోబరు 31న సస్పెండ్‌ చేశారు. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం కేటాయించిన సన్నధాన్యాన్ని మళ్లించి, ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లోని 16 మిల్లులు ఏకంగా 3,385 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని అంటగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో అక్టోబరు 26న 14 మంది మిల్లర్లను అరెస్టు చేశారు.

PDS Rice Scam | ధరలకు కళ్లెం.. నవంబరు కోటాపై నిఘా

మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం గరిష్ఠ చిల్లర ధరలను (కిలోకు) ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాలకు రూ.66, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనాకు రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్‌ రకాలకు రూ.79గా నిర్ణయించింది. కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించింది. మూడు నెలల విరామం తర్వాత నవంబరు నుంచి రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ తిరిగి ప్రారంభమైంది. స్మార్ట్‌ పీడీఎస్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 1.06 కోట్లకు పైగా కార్డుదారులకు పంపిణీ కొనసాగుతోంది. పంపిణీ చేసే బియ్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు, దుకాణాలకు చేరిన నిల్వలు, పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు సరిపోల్చుతూ అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుంది.

ఇది కూడా చదవండి..: Limbadri Gutta | ఎదుర్కోలులో ఉప్పొంగిన భక్తిపారవశ్యం.. లింబాద్రిగుట్టపై కనులపండువగా బ్రహ్మోత్సవం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *