అక్షరటుడే, బోధన్ : Bodhan Hundred Pillar Temple | చారిత్రాత్మకమైన బోధన్ ఇంద్ర నారాయణ స్వామి ఆలయం (వంద స్తంభాల గుడి)ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు,న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ (Bodhan) పట్టణంలో శనివారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.
Bodhan Hundred Pillar Temple | భక్తులకు పూజలు చేసే అవకాశం
అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆలయంలో భక్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఇంద్ర నారాయణ స్వామి ఆలయాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన పురాతన శిల్పకళ, శిలా సంపద, నిర్మాణ అవశేషాలను సంరక్షించి, ఆలయాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆలయానికి 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆలయ పరిధిలోని స్థలాన్ని పరిరక్షించి, ఎటువంటి ఆక్రమణలు లేదా నిర్మాణాలకు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bodhan Hundred Pillar Temple | దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలి
ఆలయాన్ని ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని, పునరుద్ధరణ, అభివృద్ధి, నిర్వహణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. చారిత్రాత్మక దేవాలయాల శిల్పకళ, వాస్తుశిల్పం, హిందూ ధార్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశంపై గతనెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్, దేవాదాయ శాఖ కార్యదర్శికి, కలెక్టర్, బోధన్ ఆర్డీవో, తహశీల్దార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత అధికారులకు లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి, చారిత్రాత్మక ఆలయ పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోధన్ ప్రజలతో పాటు మెజారిటీ హిందూ భక్తుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించి, ఆలయ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో ధర్మపురి, అశోక్ గౌడ్, గోపి కిషన్, రాజులదేవి పవన్, పెర్కా వెంకటేష్, కందికట్ల వాసు, దుర్గా ప్రసాద్, గౌతమ్, భూమేష్, నిమ్మ శ్రీనివాస్, శివరాజ్, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Municipality | బల్దియాలో ప్రైవేట్ వ్యక్తుల హవా!.. అధికారులపై అజమాయిషీకి యత్నం