అక్షరటుడే, వెబ్డెస్క్: Bulgaria Highway Accident | తూర్పు ఐరోపా దేశమైన బుల్గేరియాలో ఊహించని దట్టమైన పొగమంచు పెను విషాదాన్ని నింపింది. రాజధాని సోఫియాను, నల్లసముద్ర తీర నగరమైన బర్గస్‌తో అనుసంధానించే హైవేపై ఏకంగా 86 వాహనాలు ఒకదానికొకటి దారుణంగా ఢీకొన్నాయి. సరిగ్గా ఒకే పాయింట్‌లో రోడ్డుకి ఇరువైపులా జరిగిన ఈ భయంకర ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Bulgaria Highway Accident | ఇరువైపులా ఢీకొన్న భారీ ట్రక్కులు, కార్లు
ఈ ఘోర దుర్ఘటన హైవేకి ఇరువైపులా ఉన్న లేన్లలో రెండు ప్రధాన ప్రమాదాలుగా చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పాటు భారీ లారీలు, ట్రక్కులు, ప్రైవేటు వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ఈ మారణహోమానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
ప్రమాద తీవ్రత కారణంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సంఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు బుల్గేరియా ఆరోగ్య శాఖ మంత్రి కత్య ఇవకోవ వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
Bulgaria Highway Accident | వర్ణించలేని దారుణ దృశ్యాలు..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన రీజినల్ గవర్నర్ మిహాయిల్ కాషెరోవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలను మాటల్లో వర్ణించడం కష్టమని, తన జీవితంలో ఇలాంటి భయంకరమైన ప్రమాదాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశీ పర్యటన రద్దు చేసుకున్న అధ్యక్షురాలు
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ‘పారిస్ పీస్ ఫోరమ్’ పర్యటనలో ఉన్న బుల్గేరియా అధ్యక్షురాలు ఇలియానా ఇయోటోవా తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి పయనమయ్యారు.
అదే సమయంలో బుల్గేరియా పర్యటనలో ఉన్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో జరుగుతున్న అధికారిక భేటీని విడిచిపెట్టి దేశ ప్రధాని రూమెన్ రాదేవ్ కూడా వెంటనే ప్రమాద స్థలికి బయలుదేరి వెళ్లారు. పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..