అక్షరటుడే, వెబ్‌డెస్క్: Strait of Hormuz | అమెరికా, ఇరాన్ Iran మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా హక్కును సూచించేలా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఓ మ్యాప్‌ను విడుదల చేయడం సంచలనంగా మారింది.
హార్మూజ్ జలసంధిపై ఇప్పటికే అమెరికా పూర్తి నియంత్రణ కలిగి ఉందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మ్యాప్‌ను పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Strait of Hormuz | హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదు: ఇరాన్
హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ కీలక జలమార్గం తమ అధీనంలోనే ఉందంటూ ఇరుదేశాలు వేర్వేరు సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నాయి.
అమెరికాతో కుదిరినట్లు పేర్కొంటున్న 14 అంశాల అవగాహనలోని తమ డిమాండ్లు పూర్తిగా అమలయ్యే వరకు హార్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు జలసంధి ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాతే దానిని తిరిగి తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
Strait of Hormuz | ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అదే సమయంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే చర్యలకు పాల్పడవద్దని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. తమపై ఎలాంటి సైనిక చర్య జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, దానికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి కావడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.