Peddi Sudarshan Reddy Statue | పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు..కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..అసలేం జరిగిందంటే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddi Sudarshan Reddy Statue | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ Telangana ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడం రాజకీయ వివాదానికి దారితీసింది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. రాత్రి వేళ విగ్రహాన్ని తొలగించడం పాశవిక చర్యగా ఆయన అభివర్ణించారు.

నర్సంపేట మెడికల్‌ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తొలగించారు. విగ్రహంతో పాటు దాని గద్దెను కూడా కూల్చివేసినట్లు సమాచారం. ఈ చర్యతో నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Peddi Sudarshan Reddy Statue | రేవంత్‌ రెడ్డి మెప్పు కోసమేనా?

విగ్రహం తొలగింపు చర్యపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నర్సంపేటలో నిలబెడితేనే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, అందుకే అర్ధరాత్రి చర్యకు పాల్పడ్డారని కేటీఆర్‌ ఆరోపించారు.

Peddi Sudarshan Reddy Statue | అసలేం జరిగిందంటే..

పెద్ది సుదర్శన్‌రెడ్డి గత నెల (జులై) 31న గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన దశదిన కర్మ సందర్భంగా నర్సంపేటలోని మెడికల్‌ కాలేజీ సమీపంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం విషయంలో వివాదం తలెత్తింది. సంబంధిత అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నది అధికారుల వాదన.

మరోవైపు, విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం ప్రైవేటు భూమి అని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీంతో విగ్రహం ఏర్పాటు, భూమి హక్కులు, అనుమతుల అంశాలపై ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగింది.

Peddi Sudarshan Reddy Statue | తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు

ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే అధికారులు విగ్రహాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

Telangana Employee Retirement | రిటైర్మెంట్ల పర్వం.. తెలంగాణ ఖజానాపై పెరుగుతున్న పింఛన్ల భారం

పోలీసుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు.. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించారు.

విగ్రహంతో పాటు దానిని ఏర్పాటు చేసిన గద్దెను కూడా తొలగించినట్లు సమాచారం. ఈ చర్య పూర్తయ్యే వరకు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

విగ్రహం తొలగింపు విషయం బయటకు రావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారని, పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారని, మరికొందరిని ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేసినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి.

Peddi Sudarshan Reddy Statue | రాజకీయ కక్ష సాధింపే: బీఆర్‌ఎస్‌

విగ్రహం తొలగింపును బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. ప్రజల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉన్న ఆదరణను విగ్రహం తొలగించడం ద్వారా చెరిపివేయలేరని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

మరోవైపు, అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే కారణంతోనే అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉంది.

Peddi Sudarshan Reddy Statue | నర్సంపేటలో ఉద్రిక్తత

విగ్రహం తొలగింపు విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. పరిస్థితులు అదుపు తప్పకుండా నర్సంపేటలో భారీగా పోలీసులను మోహరించారు.

ఇదిలా ఉండగా, విగ్రహం తొలగింపుతో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి పెద్ది స్వప్న విగ్రహం తొలగించిన ప్రదేశంలో కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.

విగ్రహం తొలగింపు వ్యవహారంతో నర్సంపేటలో రాజకీయంగా మరింత వేడెక్కింది. అధికారుల చర్యకు సంబంధించిన కారణాలు, బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *