అక్షరటుడే, వెబ్‌డెస్క్: Devadula Water Lift | కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మేడిగడ్డ విషయంలో కుంటిసాకులు చెప్తున్నారని, మరి దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటి పారుదల మంత్రిగా ఉత్తమ్ విఫలమయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుందన్నారు. ‘మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నారని ఆరోపించారు.
Devadula Water Lift | 900 క్యూసెక్కులు మాత్రమే.
సమ్మక్క సాగర్ బ్యారేజీలో ఈరోజు 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని హరీశ్‌రావు అన్నారు. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయని, ప్రస్తుతం 75 మీటర్ల వద్ద ప్రవాహం ఉందన్నారు. అయినా ప్రభుత్వం అన్ని మోటార్లను నడిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవాదుల నుంచి ప్రభుత్వం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తుందని విమర్శించారు.
Devadula Water Lift | అన్ని మోటార్లు ఆన్ చేయాలి

దేవాదుల ఫేజ్–1లో రెండు మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారని, ఫేజ్–2లో రెండు మోటార్లకు ఒకటి, ఫేజ్–3లో 6 మోటార్లు ఉంటే రెండు మాత్రమే ఆన్ చేశారని చెప్పారు. రామప్ప చెరువులో నీరు లేదన్నారు. దేవాదుల నుంచి ఆ చెరువును నింపే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో 75 శాతం చెరువులు ఎండిపోయాయన్నారు. గోదావరి నీళ్లు పోతుంటే.. వాటిని వినియోగించుకోవాలనే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి..: Janakampet Goods Shed | రేపు జానకంపేట్ గూడ్స్ షెడ్ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం