అక్షరటుడే, కామారెడ్డి: Chaganti Koteswara Rao pravachanam | పరమ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్ఠలతో, సంపూర్ణ భక్తిభావంతో భగవంతుడిని ఆరాధించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ఉద్బోధించారు. మనసు లగ్నం చేసి చేసే పూజను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడని, ఏదో మొక్కుబడిగా చేస్తే దానిని కేవలం ఒక తంతుగానే చూస్తాడని ఆయన స్పష్టం చేశారు.
అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ‘కార్తీక మాస విశిష్టత’ ప్రవచన కార్యక్రమం రెండో రోజు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది.
Chaganti Koteswara Rao pravachanam | ఈశ్వరునికి కృతజ్ఞతతోనే రోజు ప్రారంభం కావాలి
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర రావు ప్రవచనామృతాన్ని అందిస్తూ.. కార్తీక మాసం మానవాళికి ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను నేర్పిస్తుందని తెలిపారు. మన పంచేంద్రియాలు (కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, చెవులు) సక్రమంగా పనిచేస్తున్నప్పుడే సుఖదుఃఖాల అనుభూతి కలుగుతుందని, అవి పనిచేయని నాడు దేనినీ గ్రహించలేమని వివరించారు.
అందుకే ఈ శరీరాన్ని, ఇంద్రియాలను ప్రసాదించిన ఆ ఈశ్వరునికి కృతజ్ఞత తెలపడంతోనే ప్రతి ఒక్కరి దినచర్య ప్రారంభం కావాలని సూచించారు. ఇంట్లో పూజకు అనువైన విశాలమైన స్థలం లేకపోయినా సరే, ఉన్నంతలోనే 108 నామాలతో, దీప, ధూప, గంధ, పుష్ప, నైవేద్యాలతో భక్తితో అర్చించాలని పేర్కొన్నారు. భగవంతుడు మనం పూజ చేశామా లేదా అన్నది చూస్తాడే తప్ప, ఎంత పెద్ద స్థలంలో చేశామన్నది చూడడని చాగంటి గుర్తుచేశారు.
Chaganti Koteswara Rao pravachanam | శివకేశవులకు ప్రీతికరమైన మాసం..
సనాతన ధర్మంలో పూజ ఒక అంతర్భాగమని పేర్కొన్న చాగంటి, శివకేశవులిద్దరికీ కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనదని వివరించారు. ఈ మాసంలో పరమశివునికి బిల్వార్చన, అభిషేకం; శ్రీమహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని చెప్పారు.
అలాగే కార్తీక సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో నదీ స్నానం, ఉపవాసం, జాగరణ, దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగి మనసు నిర్మలమవుతుందన్నారు. దీపం వెలిగించడం అంటే కేవలం బాహ్య వెలుగు కోసం కాదని, మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలడమేనని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని వివరించారు.
తులసి మొక్క లేని ఇల్లు, దీపం వెలగని ఇల్లు నిజమైన ఇల్లు కాదని, ప్రతి ఇంటా ఉదయం, సాయంత్రం దీపారాధన జరగాలని, ముఖ్యంగా మహిళలు తులసి కోట వద్ద దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని తెలిపారు.
ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉందని, ఉసిరి గాలిని పీల్చడం, ఆ చెట్టు నీడలో భుజించడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి, ఆరోగ్యం చేకూరుతాయని పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని, కాబట్టి కాలాన్ని వృథా చేయకుండా దైవచింతనలో గడపాలని భక్తులకు పిలుపునిచ్చారు.
Chaganti Koteswara Rao pravachanam | ప్రముఖుల భాగస్వామ్యం
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యుడు కంబాల రవి పాల్గొని ప్రవచనాన్ని ఆలకించారు. వీరితో పాటు కౌన్సిలర్లు రాంశెట్టి హర్షిత, తాటి లావణ్య, బోజన్నగారి వినోద, వంశీ కృష్ణ, లక్ష్మా రెడ్డి, నూకల ఉదయ్, నస్కంటి శ్రీనివాస్, మానస రాజేందర్, యద అంజయ్య, గొనె శ్రీనివాస్, మారుతి, పంపరి లక్ష్మణ్, భక్తులు హాజరయ్యారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..