అక్షరటుడే, వెబ్డెస్క్: Dadar metro station renamed | మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన దాదర్ మెట్రో స్టేషన్ పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దాదర్ మెట్రో స్టేషన్‌ను ‘చైత్యభూమి’ మెట్రో స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
Dadar metro station renamed | అంబేద్కర్ గౌరవార్థం కీలక నిర్ణయం
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అంత్యక్రియలు జరిగిన పవిత్ర స్మారక చిహ్నం ‘చైత్యభూమి’ దాదర్ సమీపంలోనే కొలువై ఉంది. మహానీయుడు అంబేద్కర్ స్మారక స్థలానికి మరింత గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మెట్రో స్టేషన్‌కు ఆయన స్మారక చిహ్నం పేరును ఖరారు చేశారు.
Dadar metro station renamed | రైల్వే స్టేషన్ పేరులో మార్పు లేదు
ఈ పేరు మార్పు కేవలం మెట్రో స్టేషన్‌కు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. దాదర్ రైల్వే స్టేషన్ పేరులో ఎలాంటి మార్పు లేదని, అది యథాతథంగా ‘దాదర్’ పేరుతోనే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావద్దని సూచించారు.
స్థానికుల చిరకాల కోరిక నెరవేరింది
దాదర్ మెట్రో స్టేషన్ పేరును చైత్యభూమిగా మార్చాలని స్థానిక ప్రజలు, అంబేద్కరైట్లు, వివిధ ప్రజాసంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాయి. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై అంబేద్కర్ అభిమానులు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..