అక్షరటుడే, వెబ్డెస్క్ : Chandupatla Inscription | చందుపట్ల చరిత్రను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి 737వ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రుద్రమదేవి చందుపట్ల గ్రామంలోనే వీరమరణం పొందారనడానికి చారిత్రక ఆనవాళ్లు, రాతి శాసనాలు సజీవ సాక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో గ్రామ యువకులు, పెద్దల కృషితో పురావస్తు శాఖ అధికారులు ఇక్కడి శాసనాలను అధ్యయనం చేసి, రాణి రుద్రమదేవి ఇక్కడే మరణించినట్లు నిర్ధారించారని గుర్తు చేశారు. ఆ తర్వాత గ్రామస్థుల సహకారంతో శిలాశాసనం ఏర్పాటు చేయడం, బ్యాంకు సహకారంతో వివేకానంద యువజన మండలి సభ్యులు రుద్రమదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమని కొనియాడారు.
Chandupatla Inscription | ప్రభుత్వ ఆధ్వర్యంలో..
వరంగల్ కోటలో జరిగే కాకతీయ ఉత్సవాలు, ఇతర అధికారిక కార్యక్రమాల తరహాలోనే చందుపట్లలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వర్ధంతి జరిగేలా చూడాలని సర్పంచ్ కోరిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సంబంధిత సాంస్కృతిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి చందుపట్ల చరిత్రకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా వెంకటాచారి, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, మేడవరపు అశోక్ రావు, ఉప సర్పంచ్ మంజుల శ్రీను, మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజుల, గాథాగొని కొండయ్య, నరేందర్, మలీగి రెడ్డి రంగారెడ్డి, యేసు రత్నం, యాస కరుణాకర్, వివేకానంద యువజన మండలి అధ్యక్షుడు కొండ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ, హెల్త్ ఇన్స్పెక్టర్