అక్షరటుడే, వెబ్‌డెస్క్: Citizenship Verdict | అస్సాంలోని ట్రిబ్యునల్స్ ద్వారా విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తుల పౌరసత్వ హోదాపై సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ లేదా, ఒకరిని విదేశీయుడిగా ప్రకటించడం నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
గౌహతి హైకోర్టు, ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ట్రిబ్యునల్స్ ద్వారా మరో నిష్పక్షపాత విచారణ జరిగే వరకు విదేశీయులుగా ముద్రపడిన వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. పాత ఓటర్ల జాబితాలలో తమ పేర్ల స్పెల్లింగ్‌లో అక్షరదోషాలు, చిన్నపాటి తేడాలు వంటి అతి సాంకేతిక కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించారని ఆరోపిస్తూ సావిత్రి దే, అజ్బహర్ అలీ, మహ్మద్ అక్బర్ అలీ, అబేదా ఖాతున్, అనోవారా ఖాతున్ సహా 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Citizenship Verdict | సాక్ష్యాలు పరిశీలించలేదు
అప్పీలుదారుల పౌరసత్వాన్ని నిర్ధారించడానికి తాము సాక్ష్యాలను పరిశీలించలేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ఆ పిటిషన్లను తిరిగి ట్రిబ్యునల్‌కు పంపింది. పౌరసత్వం, విదేశీయుల హోదా అనేవి రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలు అని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ తీర్పును అప్పీలుదారులకు ఎలాంటి న్యాయపరమైన ఉపశమనం కల్పించినట్లుగా భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి