Urja Suraksha | ప్రపంచమంతా ఇంధన సంక్షోభం.. ‘ఆపరేషన్ ఊర్జ సురక్ష’తో భారత్ సేఫ్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Urja Suraksha | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం.. ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సరుకు రవాణాకు కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో సరుకు రవాణా నౌకల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీని ప్రభావంతో చాలా దేశాలు పెట్రోల్ , డీజిల్ ధరలను గణనీయంగా పెంచేశాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు ధరలను పెంచాయి.

Urja Suraksha | భారత్​లో మాత్రం భిన్నంగా..

ఓవైపు ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలమవుతున్నా.. భారత్ మాత్రం వాటిని తట్టుకుని నిలబడగలిగింది. భారత్ తన ఇంధన అవసరాలను ఎలా కాపాడుకుంటోందో కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పురి ఇటీవల వివరించారు. ముడిచమురు, వంట గ్యాస్ కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా.. ఎక్కువ దేశాలకు దిగుమతులను విస్తరించడం, నౌకాదళం పహారాలో గ్యాస్ ట్యాంకర్లను తీసుకురావడం ద్వారా భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. యుద్ధ మేఘాల మధ్య కూడా సామాన్యుడిపై భారం పడకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Urja Suraksha | ఆపరేషన్ ఊర్జ సురక్ష

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడడంతో పెట్రోల్, గ్యాస్ ధరలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయో అని భారతీయులూ వణికిపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పైసా కూడా మార్పు రాలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ఊర్జ సురక్ష’తోనే (Urja Suraksha) సాధ్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు సముద్ర గర్భంలో భారత నౌకాదళం పహారా కాస్తుంటే, మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో భారత్ ఆడిన తెలివైన ఎనర్జీ గేమ్ ఇది అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటీవల సూరత్‌లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి భారత్ అనుసరించిన వ్యూహాన్ని బయటపెట్టారు. ‘మనం గత పదేళ్ల నుంచి చేస్తున్న ముందస్తు ప్రణాళిక వల్లే ఈ సంక్షోభాన్ని తట్టుకోగలిగాం. గతంలో 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు 41 దేశాలనుంచి చేసుకుంటున్నాం. కేవలం అరబ్ దేశాలపైనే ఆధారపడకుండా అమెరికా, నార్వే, అల్జీరియా వంటి దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులను భారత్ ప్రారంభించింది’ అని మంత్రి పేర్కొన్నారు. అంటే ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడి ఒక ప్రాంతంనుంచి సరఫరా ఆగినా దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచుకున్నామన్న మాట.

దేశీయంగా పెరిగిన ఉత్పత్తి..

గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పటికీ సామాన్యుడిపై ఆ భారం పడకుండా ప్రభుత్వం భరిస్తోంది. మరోవైపు సరఫరా ఆగకుండా చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని సైతం గణనీయంగా పెంచింది. గతంలో రోజుకు 36 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేసేవారు. ప్రస్తుతం ఇది 54 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే దేశీయ ఉత్పత్తి 60 శాతం పెరిగిందన్న మాట. ప్రభుత్వం పారిశ్రామిక రంగానికంటే వంటింటి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇళ్లలో వంట గ్యాస్ కు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు.

ఇది కూడా చదవండి..: Kaluputics viral boy | ఇన్​స్టాగ్రామ్​ను ఊపేస్తున్న యువకుడు.. కలుపుటిక్స్​ వీడియోలకు మిలియ‌న్లలో వ్యూస్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *