Coastal Karnataka Tour | ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. ఒకే ప్యాకేజీలో 7 పుణ్యక్షేత్రాలు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ‘కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ’ పేరుతో ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Coastal Karnataka Tour | కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అందమైన తీర ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికోసం భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) సౌత్ సెంట్రల్ జోన్ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

‘కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ’లో భాగంగా ఉడుపి, గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి, హోరనాడు, కుక్కె, మంగళూరు వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రతి మంగళవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైలు ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్ల పాటు కొనసాగే ఈ ప్రత్యేక రైలు యాత్ర వివరాలు తెలుసుకుందామా..

Coastal Karnataka Tour | షెడ్యూల్ ఇలా..

ఈ టూర్ ప్రతి మంగళవారం ఉదయం 6.05 గంటలకు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ‘కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ’ (నెం. 12789) రైలులో ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలులోనే ప్రయాణం.

బుధవారం: రైలు ఉదయం 9.15 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉడుపికి తీసుకువెళ్తారు. హోటల్‌లో చెకఇన్ చేసిన తర్వాత శ్రీకృష్ణ దేవాలయం, మాల్పె బీచ్‌ను సందర్శన ఉంటాయి. రాత్రి ఉడుపిలోనే బస చేయాల్సి ఉంటుంది.

గురువారం: గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, మురుడేశ్వర ఆలయం, కొల్లూరులోని మూకాంబిక ఆలయాల సందర్శన అనంతరం తిరిగి ఉడుపికి చేరుకుంటారు. రాత్రి బస ఉడుపిలోనే ఉంటుంది.

శుక్రవారం: ఉదయం హోటల్ నుంచి చెకఅవుట్ అయ్యి హోరనాడుకు బయలుదేరతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శృంగేరికి వెళ్లి శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. రైలు రాత్రికి మంగళూరు చేరుకుంటుంది. రాత్రి బస మంగళూరులో ఉంటుంది.

శనివారం: ఉదయం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి, సాయంత్రం 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు 12790 నంబర్ రైలులో తిరుగు ప్రయాణం అవుతారు.

ఆదివారం: రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక పర్యటన ముగుస్తుంది.

Coastal Karnataka Tour | రెండు కేటగిరీల్లో ప్యాకేజీ..

ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని రెండు కేటగిరీలలో అందిస్తోంది. అవి కంఫర్ట్ (3 ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్). ప్రయాణికుల సంఖ్య, హోటల్ గదిని ఎంతమందితో పంచుకుంటారనే దానిపై టికెట్ ధర ఆధారపడి ఉంటుంది.

కంఫర్ట్ : ట్రిపుల్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ. 19,240, ట్విన్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ. 23,910, సింగిల్ షేరింగ్ ధర రూ. 41,930 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు బెడ్‌తో అయితే రూ.9,810, బెడ్ అవసరం లేకపోతే రూ.8,600 చెల్లించాల్సి ఉంటుంది.

స్టాండర్డ్ : ట్రిపుల్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ. 16,180, ట్విన్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ. 20,850, సింగిల్ షేరింగ్ ధర రూ. 38,870 గా నిర్ణయించారు. బెడ్‌తో వెళ్లే పిల్లలకు రూ.6,750, బెడ్ లేకుండా వెళ్లేవారికి రూ.5,540 చెల్లించాల్సి ఉంటుంది.

నలుగురి నుంచి ఆరుగురు వరకు బుకింగ్ చేసుకుంటే ప్యాకేజీ ధరలు కాస్త తగ్గుతాయి. కంఫర్ట్ (3ఏసీ) కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.20,170, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.17,740 ఉంటుంది. బెడ్ అవసరం ఉన్న పిల్లలకు రూ. 10,040, బెడ్ లేకుండా అయితే రూ.8,830 ధర చెల్లించాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.17,100, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,180 టికెట్ నిర్ణయించారు. బెడ్ అవసరం ఉన్న పిల్లలకు రూ.6,970, బెడ్ లేకుండా రూ.5,760 ధర నిర్ణయించారు.

Coastal Karnataka Tour | వసతులు..

ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, స్థానిక ఏసీ బస్సు రవాణా, మూడు రాత్రుల ఏసీ హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, ప్రయాణ బీమా, టోల్ ఫీజులు, జీఎస్టీ తదితర ఖర్చులు కలిపి ఉన్నాయి. రైలులో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, దేవాలయాల దర్శన టికెట్లు, మాల్పె బీచ్‌లో పడవ ప్రయాణం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ఆసక్తి గలవారు www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: Sonia Gandhi | ఎమర్జెన్సీపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *