Ration Card Rules 2026 | రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ కార్డులు రద్దు..!

దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో లోపాలను సరిదిద్దేందుకు, బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ration Card Rules 2026 | దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో లోపాలను సరిదిద్దేందుకు, బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి సరికొత్త నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు సమాచారం. గడిచిన ఆరు నెలలుగా ఎలాంటి సరుకులు తీసుకోని వారి రేషన్ కార్డులను టెంపరరీగా డిసేబుల్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల మందికి సంబంధించిన రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Ration Card Rules 2026 | సైలెంట్ రేషన్ కార్డుల గుర్తింపు..

గత ఆరు నెలలుగా ఒక్కసారీ బియ్యం లేదా ఇతర ఆహార ధాన్యాలను పొందని కార్డులను “సైలెంట్ రేషన్ కార్డులు”గా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వర్గీకరించింది. అయితే, లబ్ధిదారుల పేర్లను నేరుగా డేటాబేస్ నుంచి తొలగించకుండా.. ముందుగా ఆ కార్డులను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆ తర్వాత, తాము నిజమైన అర్హులమేనని నిరూపించుకోవడానికి సంబంధిత కార్డుదారులకు 3 నెలల సమయం ఇవ్వనున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణను పూర్తి చేసుకుని, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ముగించుకుంటే ఆ రేషన్ కార్డులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి.

Ration Card Rules 2026 | పక్కా ప్రక్షాళన..

దేశంలో నకిలీ, డూప్లికేట్ కార్డులు, మరణించిన వారి పేర్లు అలాగే అర్హత లేని వ్యక్తుల ద్వారా పీడీఎస్ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం. ఆధార్ లింకింగ్, డిజిటలైజేషన్, బయోమెట్రిక్ సీడింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి అధికారులు పీడీఎస్‌ను ప్రక్షాళన చేస్తున్నారు. గతంలో నవంబర్ 2024 నాటికి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి దేశవ్యాప్తంగా సుమారు 5.8 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించినట్లు ఆహార శాఖ వెల్లడించింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ధాన్యం వృథా అరికట్టవచ్చని భావిస్తున్నారు.

Ration Card Rules 2026 | నిపుణుల నుంచి వ్యతిరేకత..

మరోవైపు, కేంద్రం తీసుకున్న ఈ విధానంపై కొందరు నిపుణులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు లబ్ధిదారులు సరుకులు ఎందుకు తీసుకోలేదనే విషయాన్ని ముందుగా తెలుసుకోకుండా, నేరుగా కార్డులను నిలిపివేయడం వల్ల నిజమైన పేదవారు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజేంద్రన్ నారాయణన్ అభిప్రాయపడ్డారు. వలసలు వెళ్లడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం లేదా డీలర్ల నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల కూడా కొందరు సరుకులు తీసుకోకపోవచ్చని ఆయన చెప్పారు. ముందే కార్డులను రద్దు చేసి, ఆ తర్వాత తప్పులేదని నిరూపించుకునే భారాన్ని పేదలపై మోపడం సరైన పద్ధతి కాదని, దీనిపై పంచాయతీ స్థాయి కమిటీలతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి:  Anantapur RTC Driver | ఫ్రీ బస్సే కదా.. మూసుకొని ఎక్కు: మహిళను బూతులు తిట్టిన డ్రైవర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *