Revanth Reddy Land| 30 రోజుల్లో ఫామ్‌హౌస్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం రేవంత్

తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Land | తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో 22ఏ (22A) నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన ఉద్యమకారులు సర్వం కోల్పోతే, పాలకుల కుటుంబాలు మాత్రం వందలాది ఎకరాలు కూడగట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో భారీగా భూములు ఉన్నాయని వివరాలతో సహా బయటపెట్టారు.

Revanth Reddy Land | భూముల లెక్కలు..

నిబంధనల ప్రకారం కేసీఆర్ దంపతుల పేరిట 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం వారి వద్ద 67 ఎకరాలు ఉందని సీఎం వెల్లడించారు.కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 123 ఎకరాల భూమి రిజిస్టరై ఉందని తెలిపారు. ఇందులో కేటీఆర్ పేరు మీద 49 ఎకరాలు, భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, హిమాన్షు పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. ఎలాంటి వ్యాపారాలు చేసి ఈ ఆస్తులు సంపాదించారని, ఇదంతా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కాదా అని నిలదీశారు.

Revanth Reddy Land | 30 రోజుల్లో  స్వాధీనం..

కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉందని, దీని లెక్కలను ఇప్పుడే తేల్చాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను అసెంబ్లీ సాక్షిగా ఆదేశిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కేవలం 30 రోజుల్లోనే స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు, ముఖ్యంగా ఎస్సీలకు ఆ భూముల్లో యాజమాన్య హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

Revanth Reddy Land | హరీశ్ రావుపై విమర్శలు..

సంచలనం సృష్టించిన సత్యం స్కామ్‌కు సంబంధించిన భూములు కేటీఆర్ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని, కేటీఆర్ ఫామ్‌హౌస్ కూడా అదే భూముల్లోనే ఉందని ఆరోపించారు. అంతేకాకుండా, సిద్దిపేట మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తూ హరీశ్ రావు తన ఫామ్‌హౌస్‌కు రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు.

Revanth Reddy Land | మంత్రి పొంగులేటిపై కుట్రలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి మనిషి కావడంతో కొందరికి ఆయనపై కక్ష పెరిగిందని సీఎం తెలిపారు. 22ఏ నిబంధనలపై కావాలనే కుట్రలు చేస్తూ, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, గత ప్రభుత్వ భూదోపిడీ బండారాన్ని బయటపెడితే “రాస్తే రామాయణం.. చెప్తే భారతం” అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో ముగించారు.

ఇది కూడా చదవండి:  Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *