Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | ఢిల్లీ వీధుల్లో రచ్చకెక్కిన తెలంగాణ కాంగ్రెస్‌.. జుక్కల్​ ఎమ్మెల్యేను బూతులు తిట్టిన మంత్రి!

తోటి ఎమ్మెల్యేల ముందే ఒక సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను 'గదిలోకి తీసుకెళ్లి కొడతా' అని బహిరంగంగా బెదిరించడం అధికార మదానికి పరాకాష్ట అని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | హస్తం పార్టీలో ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో నడిచే కీచులాటలు ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని వీధులకు, నక్షత్ర హోటళ్ల లాబీలకు ఎక్కింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, రైతు ఇబ్బందులపై దృష్టి సారించాల్సిన అధికార పార్టీ నేతలు.. తమ స్వప్రయోజనాలు, స్థానిక ఆధిపత్యం కోసం ఏకంగా ఏఐసీసీ (AICC) కార్యక్రమాల వేదికగానే బూతు పురాణాలకు దిగడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఢిల్లీలోని ‘షాంగ్రిల్లా’ హోటల్ లాబీలో సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై ప్రదర్శించిన వైఖరి కాంగ్రెస్ అంతర్గత సంస్కృతికి అద్దం పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | ఆధిపత్య పోరుకు ‘డీసీసీ’ సమిధ..

ఉమ్మడి మెదక్ Medak, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా సంగారెడ్డి డీసీసీ (DCC) కార్యవర్గంలో తమ అనుచరులకు పదవులు దక్కించుకోవాలనే పట్టుదలే ఈ రచ్చకు మూలకారణంగా తెలుస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

దశాబ్దాలుగా పార్టీని ఏలుతున్న సీనియర్లు, తమ పరిధిలోని నియోజకవర్గాల్లో కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధులను స్వతంత్రంగా ఎదగనివ్వకుండా తమ ‘సామంతులు’గా చూడాలనే అహంకార ధోరణే ఈ వివాదానికి కారణమనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.

‘మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం.. అధిష్ఠానం, సీఎంతో నేరుగా పనిచేస్తాం’ అని భావించే కొత్త ఎమ్మెల్యేలకు, ఉమ్మడి జిల్లాలపై సర్వాధిపత్యం తమదేననే సీనియర్ మంత్రులకు మధ్య తీవ్ర వైరుధ్యం నెలకొంది.

తోటి ఎమ్మెల్యేల ముందే ఒక సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ‘గదిలోకి తీసుకెళ్లి కొడతా’ అని బహిరంగంగా బెదిరించడం అధికార మదానికి పరాకాష్ట అని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | ఢిల్లీ పంచాయతీలతో సాధించేదేంటి?

గతంలో రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఢిల్లీకి వెళ్లి తేల్చుకునే కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగానే కుమ్ములాటలకు దిగుతుండటం గమనార్హం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసమ్మతి కామెంట్లు, కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, ఇప్పుడు మంత్రి-ఎమ్మెల్యేల గొడవ.. ఇలా వరుస ఘటనలతో కాంగ్రెస్ మార్క్ ‘శిఖండి రాజకీయం’ మళ్లీ మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | హస్తం మార్క్ సైలెంట్ డ్రామా

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనప్పటికీ, ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యంపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటుందా ? లేక ‘సర్దుబాటు రాజకీయం’తో కప్పిపుచ్చుతుందా.. అనేది వేచి చూడాలి.

పాలనా విషయాలపై శ్రద్ధ పెట్టకుండా, పార్టీ నాయకులు అంతర్గత పదవుల కోసమే రచ్చకెక్కుతుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *