అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/బోధన్: Drinking Water Supply | జిల్లాలో తాగునీటి సరఫరాలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. బోధన్ (Bodhan) సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్, బాన్సువాడ (Banswada) నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీవోలు ఇతర అధికారులతో కలెక్టర్ తాగునీటి సరఫరాపై సమీక్షించారు.
Drinking Water Supply | వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని..
వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున, నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు.
Drinking Water Supply | తక్షణమే మరమ్మతులు చేయించాలి
చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపలిటీల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పక్కాగా పర్యవేక్షణ జరపాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.
Drinking Water Supply | మారుమూల ప్రాంతాలకుసైతం..
ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన తరహాలోనే అనంతగిరి, నెహ్రూనగర్ గ్రామాలకు సైతం సమృద్ధిగా తాగునీటి సరఫరా కోసం ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్‌ను (Online Booster System) ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా చూడాలని, పైప్లైన్లు, వాల్వ్‌లకు నష్టం కలిగేలా వ్యవహరించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, మిషన్ భగీరథ ఈఈలు రాకేష్, స్వప్న, డీఎల్పీవోలు శ్రీనివాస్, నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఏఈలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Election Commissioner Removal | ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని రాజ్యసభలో విపక్షాల నోటీస్

