అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake 50 notes Nizamabad | పొట్టకూటి కోసం రోజంతా ఎండనకా, వాననకా కష్టపడే నిరుపేద చిరువ్యాపారులను సైతం కేటుగాళ్లు వదలడం లేదు. నిజామాబాద్ Nizamabad నగరంలోని అత్యంత రద్దీగా ఉండే గంజ్ (కూరగాయల మార్కెట్) ప్రాంతంలో నకిలీ రూ. 50 నోట్ల (Fake Currency) చలామణి కలకలం రేపుతోంది. అమాయకులైన వృద్ధ కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు దొంగ నోట్లను అంటగట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Fake 50 notes Nizamabad | ఒకే సీరియల్ నంబర్‌తో నకిలీ నోట్లు!
గంజ్ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే వృద్ధ వ్యాపారుల వద్దకు వచ్చిన కొందరు కేటుగాళ్లు, కూరగాయలు కొనుగోలు చేసినట్లు నటించి రూ. 50 నకిలీ నోట్లను చేతిలో పెట్టి ఉడాయించారు. వ్యాపారులు వాటిని పరిశీలించగా అసలు బండారం బయటపడింది.
ఇలా సుమారు 10 – 15 వరకు అనుమానాస్పద రూ. 50 నోట్లు బయటపడగా, వాటన్నింటిపై ఒకే సీరియల్ నంబర్ ముద్రించి ఉండటం గమనార్హం. స్థానిక మార్కెట్‌లో దొంగ నోట్లు చలామణి అవుతుండటంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fake 50 notes Nizamabad | రూ. 50 పోయినా పెద్ద నష్టమే..
తమకు జరిగిన మోసంపై బాధిత వృద్ధ వ్యాపారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. “మేము రోజంతా కష్టపడి కూరగాయలు అమ్మితే వచ్చేదే కేవలం రూ. 300 నుంచి రూ. 500 మాత్రమే. అలాంటిది మా కష్టార్జితంలో ఒక్క రూ. 50 నోటు నకిలీది వచ్చినా అది మాకు చాలా పెద్ద ఆర్థిక నష్టం” అంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Fake 50 notes Nizamabad | కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
నిరుపేద వీధి వ్యాపారుల కడుపు కొడుతున్న ఈ దొంగ నోట్ల ముఠాపై పోలీసులు తక్షణమే దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. మార్కెట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి, నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, తమలాంటి పేద వ్యాపారులకు రక్షణ కల్పించాలని వారు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..