అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Farmer Crop Loans | ఎల్నినో నేపథ్యంలో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు బాసటగా నిలువాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.
Farmer Crop Loans | పంట రుణాల రీషెడ్యూల్..
ఎల్నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో పంట రుణాల రీషెడ్యూల్, రైతులకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన ఆర్థిక సహాయంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎస్ఎల్బీసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత ప్రతీకూల పరిస్థితుల్లో రైతులకు బ్యాంకర్లు బాసటగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్యాంకర్లతో సమన్వయము పెంపొందించుకుని అర్హులైన రైతులకు సకాలంలో రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల పంపిణీ, అవసరమైన సహకారం అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
Farmer Crop Loans | 18 సాధారణ కరువు ప్రభావిత మండలాల్లో
ప్రభుత్వంచే గుర్తించబడిన జిల్లాలోని 18 సాధారణ కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు పంట రుణాలను ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం రీషెడ్యూల్ చేసి, 12 నెలల మారటోరియం కల్పించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు కొత్తగా పంట రుణాలు సకాలంలో అందజేసి, వారికి అండగా నిలవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా యాసంగిలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వరికి ప్రత్యామ్నాయంగా ఇతర అనువైన పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు పంట రుణాల రూపంలో ఆర్ధిక వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్బీఐ ప్రతినిధి రాములు, నాబార్డు డీడీఎం ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, వ్యవసాయ శాఖ ఏడీ వీరస్వామి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Congress Dispute | రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వివాదం.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదిరేనా..?