FII Investment Outflow | ఆగని పెట్టుబడుల ఉపసంహరణ.. 4 నెలల్లోనే రూ. 2.40 లక్షల కోట్ల అమ్మకాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FII Investment Outflow | భారత స్టాక్ మార్కెట్ కొంత కాలంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికైన తర్వాత ఆయన అమలు చేసిన రెసిప్రోకల్ టారిఫ్స్ తో ప్రారంభమైన ఒత్తిడి.. పశ్చిమాసియాలో జియోపొలిటికల్ టెన్షన్స్‌తో మరింత పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా పెరగడం, రూపాయిలో బలహీనత తదితర కారణాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు.

FII Investment Outflow | నాలుగు నెలల్లో..

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రేపన్నదే లేదన్నట్లుగా దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. నాలుగు నెలల్లోనే రూ. 2.40 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జనవరిలో నికరంగా రూ. 41,435 కోట్ల షేర్లు విక్రయించిన ఎఫ్ఐఐలు.. ఫిబ్రవరిలో మాత్రం స్పీడ్ తగ్గించారు. ఆ నెలలో నికరంగా రూ. 6,640 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే అమ్మారు. మార్చిలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నెలలో రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు.. ఏప్రిల్ లో కాస్త తగ్గి నికరంగా రూ. 70,135 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

FII Investment Outflow | రూపాయి పతనంతో ఒత్తిడి..

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటేసింది. దీంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది. గత సెషన్ లో రూ. 95.33 వద్ద మరోసారి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఇది ఎఫ్ ఐఐలను కలవరపెడుతోంది. దీంతో భారత మార్కెట్లకన్నా ఇతర మార్కెట్లలో పెట్టుబడులు సేఫ్ అన్న భావనతో ఇక్కడ అమ్మకాలకు పాల్పడుతున్నారు.

నిలబెడుతున్న డీఐఐలు..

విదేశీ మదుపరులు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అయితే కుప్పకూలడం లేదు. దీనికి కారణం దేశీయ ఇన్వెస్టర్లే.. ప్రధానంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో మార్కెట్లు నిలబడుతున్నాయి. డీఐఐలు ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 3.01 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. జనవరిలో రూ. 69 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ. 38 వేల కోట్లు, మార్చిలో రూ. 1.42 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ. 51 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇలా భారీగా పెట్టుబడులు పెడుతూ విదేశీ అమ్మకాల సెగ తగలకుండా చూస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *