Fine to Farmer | వరి కొయ్యలు కాల్చిన రైతుకు జరిమానా

వరికొయ్యలను కాల్చిన రైతుకు అధికారులు జరిమానా వేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్​ మండలంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fine to Farmer | వరికొయ్యలను కాల్చిన రైతుకు అధికారులు జరిమానా వేశారు. ఈ ఘటన జగిత్యాల (Jagtial) జిల్లా కథలాపూర్​ మండలంలో చోటు చేసుకుంది.

మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య నంద్య నాయక్​ అనే రైతు వరి సాగు చేశారు. పంట కోతల అనంతరం వరి కొయ్యలను కాల్చివేశాడు. దీంతో గ్రామ కార్యదర్శి అతడికి రూ. 5 వేల జరిమానా విధించారు. వరి కొయ్యలను కాల్చొద్దని రైతులకు సూచించారు.

Fine to Farmer | కాల్చకుండా ఏం చేయాలి

రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో వరి సాగు అవుతోంది. ప్రస్తుతం పశు సంపద తగ్గిపోయింది. దీంతో వరి గడ్డిని తక్కువ మంది కట్టుకుంటున్నారు. మిగతా వారు పంట వ్యర్థాలు, వరికొయ్యలను కాల్చి వేస్తున్నారు. అనంతరం దుక్కులు దున్నుకుని మరో సీజన్​ సాగుకు సిద్ధం అవుతున్నారు. ప్రతి యేటా అన్నదాతలు పంట వ్యర్థాలు కాలుస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతినడంతో పాటు కాలుష్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో మురిగి పోయేలా చేస్తే పంటకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే అవగాహన లేక రైతులు (Farmers) కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.

fine

Fine to Farmer | కుళ్లిపోయేలా చేయాలి

వరి కొయ్యలను కాల్చకుండా రైతులు వాటిని కుళ్లిపోయేలా చేయాలి. అలా అయితే పంటలకు మేలు జరుగుతుంది. దీని కోసం వేస్ట్​ డీకంపోజర్​ను ఉపయోగించాలి. ఒక డీ కంపోజర్​ బాటిల్​ను డ్రమ్ముల్లో కలుపుకోవాలి. అందులో రెండు కిలోల బెల్లం కలపాలి. వారం రోజులు దానిని అలాగే ఉంచి తర్వాత వరి కొయ్యలపై పిచికారి చేయాలి. దీంతో వరి కొయ్యలు, గడ్డి కుళ్లిపోయి ఎరువుగా మారుతాయి.

Fine to Farmer | వ్యవసాయ అధికారులు ఎక్కడ

ప్రతి సంవత్సరం రైతులు పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారు. అంతేగాకుండా యాసంగి సీజన్​లో పంటలు కోశాక.. ఒక రైతు కొయ్యలు తగల బెడితే అది ఎకరాల మేర వ్యాపించిన ఘటనలు ఉన్నాయి. పొరపాటున నిప్పు రవ్వలు పడిన ఎండిన గడ్డి కాలిపోతుంది. అయితే పంట వ్యర్థాలు కాల్చొద్దని అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు ఏఈవోలు ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితి. గ్రామాల్లోని రైతు వేదికల్లో అందుబాటులో ఉండాల్సిన ఏఈవోలు అప్పుడప్పుడు వచ్చి ముఖం చూపెట్టి వెళ్తున్నారు. పంట వ్యర్థాలు కాలిస్తే కలిగే నష్టాలపై కనీసం ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. స్థానికంగా ఉండటం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy HYDRAA | హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *