kamareddy Police | హాలీవుడ్​ రేంజ్​లో పోలీసులు, గ్రామస్తుల ఛేజింగ్​.. ఎట్టకేలకు చిక్కిన దొంగల ముఠా

ఆటో చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. తాము దొరికిపోతామని తెలిసి పోలీసులను అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టించారు. పోలీసులు సైతం అదే స్థాయిలో దొంగల భరతం పెట్టేందుకు భారీ ఛేజింగ్ చేసి చివరికి పట్టుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: kamareddy Police | ఆటో చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. తాము దొరికిపోతున్నామని తెలిసి పోలీసులను అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టించారు. పోలీసులు (Police) సైతం అదే స్థాయిలో దొంగల భరతం పట్టేందుకు భారీ ఛేజింగ్ చేపట్టారు. ఎట్టకేలకు వారిని గ్రామస్థుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ఘటన నాగిరెడ్డిపేట్​ (Nagireddypeta) మండల పరిధిలో చోటు చేసుకుంది.

kamareddy Police | గ్రామస్థుల సహకారంతో..

దొంగలు తప్పించుకోవడానికి వెళ్లే ప్రతిమార్గంలో గ్రామస్థులు, పోలీసులను మోహరించగా చివరికి దొంగలు పోలీసులకు చిక్కక తప్పలేదు. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మొదలైన ఓ అనుమానాస్పద కదలికను గమనించిన బ్లూకోల్ట్స్ (Blue Colts) పోలీసులు అక్కడి నుంచి ప్రారంభించిన ఉత్కంఠభరిత ఛేజింగ్ చివరకు నలుగురు వాహన దొంగల పట్టివేతతో ముగిసింది. దొంగలు తప్పించుకోవాలని చూసిన ప్రతిసారి పోలీసుల పిలుపునకు స్పందించి, అర్ధరాత్రి 3 గంటల వేళ చేతిలో టార్చ్‌లైట్లతో రంగంలోకి దిగిన గ్రామస్థులు, యువకులు, ప్రజాప్రతినిధుల సహకారం ఈ ఆపరేషన్‌కు కొండంత బలాన్నిచ్చింది. ఖాకీల పట్టుదలకు ప్రజల అండ తోడవడంతో, ప్రతి మలుపులో ఉత్కంఠ, ప్రతి క్షణంలో ఉర్రూతలూగించే పరిణామాలతో సాగిన ఈ ఘటన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా నిలిచింది.

kamareddy Police | జూన్​ 2వ తేదీన..

జూన్ 2న రాత్రి నాగిరెడ్డిపేట మండలం గోపాలపేట గ్రామానికి చెందిన మహమ్మద్​ సఫుద్దీన్​ తన ఆటోను ఇంట్లో పార్క్ చేయగా, తెల్లవారుజామున 4 గంటలకు చూసేసరికి కనిపించలేదు. దీంతో జూన్ 3న నాగిరెడ్డిపేట్ పోలీస్‌స్టేషన్‌లో (Nagireddypet Police Station) ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 6 తెల్లవారుజామున 2:30 గంటలకు గోపాల్‌పేట్ బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది రెండు బైకులపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనించారు. వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, ఒక బైక్‌ను అక్కడే వదిలివేసి ఇద్దరు వ్యక్తులు మరో బైక్‌పై పరారయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పెట్రో కార్ సిబ్బంది సురేష్, సుదర్శన్ తమ వాహనంతో అనుమానితుల వెంటపడ్డారు. పోచారం సమీపంలో పెట్రో కార్‌ను అడ్డంగా ఉంచి నిందితుల బైక్‌ను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, వారు చాకచక్యంగా తప్పించుకుని ఎల్లారెడ్డి (Yellareddy) వైపు దూసుకెళ్లారు. సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట్ ఎస్సై భార్గవ్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగడంతో మాల్తుమ్మెద గ్రామ గేటు వద్దకు చేరుకున్న నిందితులు తమ బైక్‌ను అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు.

kamareddy Police | మాల్తుమ్మెద వద్ద..

మాల్తుమ్మెద ఉపసర్పంచ్‌కు సమాచారం అందించగా, ఆయన క్షణాల్లో గ్రామస్థులను అప్రమత్తం చేశారు. రాత్రి 3 గంటల సమయంలోనే గ్రామ యువకులు, గ్రామస్తులు పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు, గ్రామస్థుల ఛేజింగ్ తట్టుకోలేక నిందితులు పోచారం వైపు చేరుకున్నారు. తాము చిక్కుకుపోతున్నామని గ్రహించిన ఇద్దరు నిందితులు తమ గ్యాంగ్‌లోని మరో ముగ్గురికి ఫోన్ చేసి లొకేషన్ పంపారు. వెంటనే ఆ ముగ్గురు దొంగిలించిన ఆటోలో పోచారం చెరువు కట్ట ప్రాంతానికి చేరుకుని తమ సహచరులను తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే బ్లూ కోల్ట్స్ సిబ్బంది వారి కదలికలను గుర్తించి వెంటాడడంతో, వారు ఆటోను అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు. ఒకవైపు పోలీసులు, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, మాల్తుమ్మెద ఉపసర్పంచ్, గ్రామస్థులు, పోచారం యువకులు కలిసి ఐదుగురు అనుమానితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

kamareddy Police | మెదక్ జిల్లా జక్కన్నపేటలో..

పరిస్థితిని అంచనా వేసిన ఎస్సై, మెదక్(Medak) జిల్లా జక్కన్నపేట సర్పంచ్‌కు సమాచారం అందించడంతో ఆయన గ్రామస్థులతో కలిసి గ్రామ ప్రవేశ మార్గాల వద్ద ప్రజలను మోహరించారు. వెనుక నుంచి పోలీసులు, గ్రామస్థులు వెంబడిస్తుండగా, ముందువైపు జక్కన్నపేట గ్రామస్తులు, పోలీసులు సిద్ధంగా ఉండటంతో నిందితులు తప్పించుకోలేక పోచారం వైపు మళ్లడంతో అక్కడ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు నలుగురిని చాకచక్యంగా పట్టుకున్నారు. మరో వ్యక్తి మాత్రం చీకట్లో పరారయ్యాడు. పట్టుబడిన నిందితులను చింత బాల్‌రాజ్, డి. కార్తీక్ రెడ్డి, ఆటి రమేష్, ఒక బాలుడిగా గుర్తించారు. పరారీలో ఉన్న షేక్ ఫయాజ్ కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మెదక్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీరి నుంచి 2 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఇది కూడా చదవండి: Nizamabad Collector | ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే గ్రామ, వార్డు సభలు: కలెక్టర్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *