అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Bonus Guidelines | సన్న వడ్లకు బోనస్‌పై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో 30కి పైగా సన్నాలు సాగు చేసిన క్వింటాల్‌కు రూ.500 ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికే వాటిని 7 రకాలకు తగ్గించింది. తాజాగా మరో మెలిక పెట్టింది. దీంతో బోనస్ అందుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది.
సన్న వడ్ల బోనస్ అమలులో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి ఈ వానాకాలం సీజన్ నుంచి అమల్లోకి రానున్నాయి. రైతులు విక్రయించిన సన్న వడ్ల వివరాలను తప్పనిసరిగా డీలర్ల వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్రమాలను అరికట్టడం, అర్హులైన రైతులకు బోనస్ అందేలా చూడడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని తెలిపింది.
Paddy Bonus Guidelines | వెబ్‌సైట్‌లో..
సన్నాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను విత్తన డీలర్లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. https://seedsgrowerp.com/seedsales/login.php వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వరి సన్న రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పాటు కొనుగోలు చేసిన విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, డీలర్ వివరాలు, కొనుగోలు చేసిన తేదీని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఒకవేళ రైతులు డీలర్ల నుంచి విత్తనం కొనకుండా గత పంటల నుంచి సేకరిస్తే సంబంధిత ఏఈవోను సంప్రదించి నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకన్న వారికి మాత్రమే బోనస్ వస్తుంది. మిగతా వారికి రాదు.
Paddy Bonus Guidelines | ఈ రకాలకే…
ప్రస్తుతం ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని తెలిపింది. అభినీత్ – 15048, బీపీటీ – 5204, కేఎన్‌ఎం – 1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూ జీఎల్ – 44, కేఎన్‌ఎం – 7715 రకాలు సాగు చేసిన వారికి మాత్రమే క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందనుంది.
Paddy Bonus Guidelines | ఆందోళనలో రైతులు
ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 50 శాతం మంది రైతులు నారు పోశాక.. ఏడు రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించించింది. ఇప్పుడు దాదాపు 75 శాతానికి పైగా మంది రైతుల వరి విత్తనాలు కొనుగోలు చేసి, నార్లు పోశారు. కొన్ని జిల్లాల్లో వరి నాట్లు కూడా సాగుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Paddy Bonus Guidelines | ఇష్టారీతిగా విక్రయాలు
రైతులు దాదాపు నెల రోజుల ముందే వరి విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే చాలా మంది డీలర్లు కనీసం రశీదు కూడా ఇవ్వకుండా విత్తనాలు, ఎరువులు అమ్ముతారు. కనీస అర్హతలు, లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. అయితే ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు.. వాటిని ఎలా నమోదు చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
Paddy Bonus Guidelines | బోనస్ కోసం తిప్పలు
దొడ్డు రకం వరి సాగు చేస్తే దిగుబడి అధికంగా ఉంటుంది. తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుంది. సన్నాలు సాగు చేస్తే దిగుబడి తగ్గడంతో పాటు పెట్టుబడి పెరుగుతుంది. బోనస్ ఇస్తే అన్నదాతలకు కొంత మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోసం చాలా మంది రైతులు సన్నాలు సాగు చేశారు. అయితే ఇప్పుడు మార్గదర్శకాలు, ఏడు రకాలకే బోనస్ అనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వం వానాకాలం సీజన్లో మాత్రమే బోనస్ ఇస్తోంది. యాసంగి సీజన్లో ఇవ్వడం లేదు.
దీనిని కూడా చదవండి : Telangana Rainfall Update | నేటి నుంచి తగ్గనున్న వర్షాలు