Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్​ చేసిన రైతులు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Farmers Protest | అధికారుల తీరుపై రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం కూడా తరలించకపోవడంపై ఆందోళన బాట పడుతున్నారు. ధాన్యం విక్రయాలతో ఇబ్బందులవుతున్నాయని.. తమకు గంజాయి సాగుకు అనుమతివ్వాలని రైతులు డిమాండ్​ చేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ ఎస్సీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది.

Kamareddy Farmers Protest | ఆవేదనతో..

ధాన్యం కొనడంలో అధికారులు విఫలం అవుతున్నారని, నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూసే ఓపిక నశిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని గంజాయి పంట పండించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరడం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. రైతుల నోట గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వాలని మాట రావడం వెనక రైతు ఆవేదన స్పష్టమవుతోంది. అయితే ఈ మాటతో అధికారులు నోరెళ్లబెట్టారు. అడ్లూర్​లోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు తరలించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడానికి నిర్ణయించారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని రైతులు ఆందోళనకు వెళ్లకుండా ఆపగలిగారు.

Kamareddy Farmers Protest | నెలరోజులుగా సెంటర్​లోనే ధాన్యం

సివిల్ సప్లయ్​ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దళారులను నమ్మవద్దని అధికారులే చెప్తారని.. తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే నెలలుగా కేంద్రంలోనే వడ్లు డంప్​ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇటు కేంద్రాల్లో.. అటు రైస్​మిల్లుల్లో దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ధాన్యం రైస్ మిల్లులకు పంపించడం మీ వల్ల కాకపోతే గంజాయి అయినా సాగు చేసుకుంటాం. వచ్చే యాసంగిలో గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు ఏ బాధ ఉండదు’ అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. దాంతో అధికారులు తెల్లముఖం వేశారు. కాంటా చేసిన ధాన్యం రైస్ మిల్లుకు వెళ్తే ఔటాన్ పేరిట 4 నుంచి 10 క్వింటాళ్లు కోత విధిస్తున్నారని కర్షకులు కన్నెర్ర చేశారు. ఇలా అయితే మేమెట్లా బతకాలి అంటూ నిలదీశారు. దీంతో అధికారులు స్పందిస్తూ ఇకనుంచి ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని, ఎప్పటికప్పుడు ధాన్యం తరలిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.

ఇది కూడా చదవండి..: Inter Admissions | ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *