Ganja Smuggling Arrest | గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Ganja Smuggling Arrest | ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Ganja Smuggling Arrest | ఆపరేషన్​ కవచ్​ పేరుతో..

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ కవచ్ పేరుతో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జాతీయ రహదారి నుంచి భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. వెంటనే కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ (Kamareddy DSP Madhusudhan) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహదారి-44పై క్యాసంపల్లి గ్రామ శివారులోని రాయల్ దాబా వద్ద తనిఖీలు చేపట్టగా, సాయంత్రం 6 గంటలకు అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశామన్నారు. పనసపండ్ల లోడ్ కింద 387.128 కిలోల గంజాయి బయటపడిందని, దీని విలువ సుమారు రూ.1,93,56,400 ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ కరిముల్లా @ కరీం, గ్రెని సుభాష్, షేక్ రహీమ్ అనే ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలపారు.

Ganja Smuggling Arrest | వాహనంతో పాటు..

వాహనంతో పాటు రెండు ఫోన్లు, రూ.500 నగదు, పనసపండ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నామని, అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ కవచ్​లో భాగంగా ఇప్పటివరకు నాలుగు గంజాయి సరఫరా కేసులను పట్టుకున్నట్టు వివరించారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ దాడిలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ మధుసూధన్, రూరల్ సీఐ శ్రీధర్, ఎస్సైలు రంజిత్, విజయ్, ఆంజనేయులు, అనిల్, పుష్పరాజ్‌లను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.

ఇది కూడా చదవండి..: Yoga Celebrations | ఉమ్మడిజిల్లాలో ఉత్సాహంగా యోగా సంబరం..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *