అక్షరటుడే వెబ్‌డెస్క్: GO 97 Protest | జీవో 97ను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో లక్ష మంది విద్యార్థులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పాలిటెక్నిక్ విద్యను పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన మద్దతు తెలిపారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు ఈ జీవోను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
GO 97 Protest | జెన్-జీ శక్తితో జాగ్రత్త..
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో నీట్ పరీక్షపై విద్యార్థులు ఉద్యమిస్తే కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఆ ప్రభావం ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని అన్నారు. గడచిన 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల దీక్షకు ఆయన సెల్యూట్ చేశారు. నేటి తరం జెన్-జీ (Gen-Z) తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఒక్క వీడియో పెడితే చాలు, ఉదయానికి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి సచివాలయాన్ని ముట్టడిస్తారని చెప్పారు.
మహబూబాబాద్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థిపై పోలీసులు వ్యవహరించిన తీరును, సూర్యాపేటలో విద్యార్థిని అరెస్ట్ చేస్తే తోటి విద్యార్థులు ఎదురువెళ్లి విడిపించుకున్న ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. జెన్-జీ అంటే కేవలం రీల్స్ చేసుకునేవారే కాదని, అవసరమైతే తమ భవిష్యత్తు కోసం పోరాడే యోధులని పేర్కొన్నారు.
GO 97 Protest | ప్రభుత్వ భూముల మీదే సీఎం కన్ను..
రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, అందులో 59 ప్రభుత్వ కాలేజీలను ఐటీఐలతో కలిపి ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని హరీశ్ రావు ఆరోపించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో నడిచే స్కిల్ యూనివర్సిటీకి మూడేళ్ల తర్వాత ప్రభుత్వ మద్దతు తొలగిపోతుందని, ఆ తర్వాత అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని చట్టంలోనే ఉందన్నారు.
వేల కోట్ల విలువైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భవనాలు, భూములను బ్యాంకుల్లో కుదువబెట్టి అప్పులు తేవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లల చదువులు, భవిష్యత్తు కంటే ప్రభుత్వ ఆస్తులు, భూముల మీదే ఆయనకు కన్ను పడిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం చూశాము..ఇప్పుడు తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాము
20 రోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని పోరాడుతున్నారు.. మీ పోరాటానికి నా సెల్యూట్
సెప్టెంబర్ 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపు జీవో 97 రద్దు… pic.twitter.com/AR5dNIGvUH
— RTV (@RTVnewsnetwork) August 25, 2026
ఇది కూడా చదవండి: Musi River Project | మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష