Godavari Water Supply | గోదావరి అదనపు జలాల తరలింపునకు జలమండలి చర్యలు

గోదావరి అదనపు జలాల తరలింపు పనులను జలమండలి ఎండీ అశోక్​రెడ్డి పరిశీలించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Water Supply | ఎల్​నినో నేపథ్యంలో సింగూరు–మంజీరా ప్రాజెక్టుల్లో నీటి మట్టం భారీగా పడిపోయింది. హైదరాబాద్​ నగరానికి నీటిని సరఫరా చేసే ఈ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలమండలి (HMWSSB) అధికారులు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) గోదావరి అదనపు జలాలను నగరానికి తరలించేందుకు అధికారులు పనులు చేపడుతున్నారు. ఘన్​పూర్ వద్ద చేపడుతున్న పైప్‌లైన్ అనుసంధాన పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సోమవారం పరిశీలించారు. నవంబర్ 15వ తేదీలోగా పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Godavari Water Supply | రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలి

పైప్‌లైన్ నిర్మాణ పనులను రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా అనుసంధానం చేయాలని ఆదేశించారు. పైప్‌లైన్ అనుసంధాన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో ప్రత్యేక కార్మిక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి షిఫ్టుకు వేర్వేరు బృందాలను నియమించి, పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు. రాత్రివేళ పనులకు అవసరమైన ఫ్లడ్‌లైట్లు, యంత్ర సామగ్రి, ఇతర సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు.

Godavari Water Supply | రోడ్డు క్రాసింగ్ పనులను..

పైప్‌లైన్ అనుసంధానానికి రోడ్డు క్రాసింగ్ పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లతో రాత్రి నుంచే రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించి, రెండు మూడు రోజుల్లో పైపులను ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ, అటవీశాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సింగూరు–మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అందించే ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

దీనిని కూడా చదవండి : Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *