Gold Silver Sweets | బంగారం, వెండితో చేసే స్వీట్లు చూశారా.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

సాధారణంగా పండగలు వచ్చాయంటే చాలు ఇళ్లల్లో రకరకాల పిండి వంటలు, స్వీట్లు చేసుకుంటూ బంధుమిత్రులకు పంచుతుంటాం..

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Silver Sweets | సాధారణంగా పండగలు వచ్చాయంటే చాలు ఇళ్లల్లో రకరకాల పిండి వంటలు, స్వీట్లు చేసుకుంటూ బంధుమిత్రులకు పంచుతుంటాం. అయితే ప్రస్తుతం పండగలకు కూడా లగ్జరీ టచ్ (Luxury Touch) విపరీతంగా పెరుగుతోంది.

ముఖ్యంగా ధనికులు, ప్రముఖులను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాల కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్వీట్ షాప్ ఏకంగా బంగారం, వెండితో స్వీట్లు తయారు చేసి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ కిలో స్వీట్ ధర అక్షరాలా రూ.1.11 లక్షలు ఉండగా.. ఒక్క స్వీట్ ముక్క కొనాలన్నా వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి రావడం గమనార్హం.

Gold Silver Sweets | కిలో కొనాలంటే నెల జీతం సమర్పించాలి…

రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్‌లోని వైశాలి నగర్ ప్రాంతంలో ‘త్యోహార్’ పేరుతో ఓ స్వీట్ షాప్ (Sweet Shop) కొనసాగుతోంది. ఈ షాప్ ప్రత్యేకంగా తయారు చేస్తున్న కాస్ట్లీ స్వీట్స్ (Costly Sweets) ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా స్వీట్లపై వెండి పూత పూయడం మనకు తెలిసిందే. కానీ ఈ షాప్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా 24 క్యారెట్ల తినదగిన బంగారం (Edible Gold), వెండితో ప్రత్యేకమైన స్వీట్లను తయారు చేస్తోంది.

ఈ స్వీట్ల ధరలు కిలోకు రూ.45 వేల నుంచి రూ.1.11 లక్షల వరకు ఉన్నాయి. అంటే ఒక కిలో స్వీట్ కొనాలంటే కొందరి నెల జీతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట.

Gold Silver Sweets | ఎందుకంత ప్రత్యేకత…

ఈ షాప్‌లో లభించే ప్రత్యేకమైన స్వీట్లలో ‘స్వర్ణ మిఠాయి’, ‘చాందీ భస్మ్ పాక్’ వంటి రకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. 24 క్యారెట్ల తినదగిన బంగారు రేకులతో తయారు చేసే ఈ గోల్డ్ స్వీట్ (Gold Sweet) ఒక్క ముక్క ధర రూ.1,111 ఉండగా.. వెండితో తయారు చేసే ప్రత్యేక స్వీట్ ఒక్క ముక్క ధర రూ.1,150గా ఉంది.

ఇవి కాకుండా స్వర్ణ భస్మ్ పాక్, చాందీ భస్మ్ పాక్ వంటి మరికొన్ని ప్రత్యేక రకాల స్వీట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన పదార్థాలతో పాటు, వాటిని అందంగా అలంకరించే విధానం, ప్రత్యేకమైన ప్యాకింగ్ (Packaging) కూడా వీటి ధర భారీగా ఉండటానికి కారణమని షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

Gold Silver Sweets | వెరైటీ డెకరేషన్..

ఈ స్వీట్ల ప్రత్యేకత కేవలం వాటి ధరలోనే పరిమితం కాలేదు. వాటిని కస్టమర్ల (Customers) కు అందించే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా స్వీట్లను అట్టపెట్టెల్లో లేదా సాధారణ ప్యాకింగ్ బాక్సుల్లో ఇస్తుంటారు.

కానీ ఇక్కడ మాత్రం అత్యంత ఖరీదైన బంగారు స్వీట్లను ఏకంగా నగల పెట్టెలో (Jewellery Box) పెట్టి అందిస్తున్నారు. దీంతో స్వీట్ కొనడానికి వచ్చినవారికి నగలు కొనుగోలు చేస్తున్న అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఎవరికైనా ప్రత్యేకంగా గిఫ్ట్ (Gift) గా ఇవ్వడానికి కూడా ఈ స్వీట్లను ఎంతో ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇంతటి ఖరీదైన స్వీట్ల తయారీ ఆలోచన వెనుక అంజలి జైన్ అనే మహిళ ఉన్నారు. ఆమె గతంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా (Chartered Accountant) పనిచేశారు. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా (Entrepreneur) మారారు.

ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలపై తనకున్న ప్రగాఢ ఆసక్తి నుంచే ఈ ప్రత్యేకమైన స్వీట్ల తయారీ ఆలోచన వచ్చిందని అంజలి తెలిపారు. సంప్రదాయ భారతీయ ఆహార విధానాన్ని ఆధునిక విలాసవంతమైన రూపంలో అందించాలనే ఉద్దేశంతో ఈ స్వీట్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. పండగల సమయంలో ప్రజలకు ఒక సరికొత్త ప్రత్యేక అనుభూతిని అందించాలన్నదే మా ప్రధాన ప్రయత్నమని ఆమె వివరించారు.

Gold Silver Sweets | పేరే స్వర్ణభస్మం..

రూ.1.11 లక్షల విలువైన ఈ స్వీట్లలో కేవలం బంగారం మాత్రమే ఉండదు. అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో (Dry Fruits) ఒకటైన చిల్‌గోజా (పైన్ నట్స్), కుంకుమపువ్వు వంటి విలువైన అత్యుత్తమ పదార్థాలను కూడా ఇందులో ఉపయోగిస్తున్నారు.

అంతేకాకుండా, ఇందులో 24 క్యారెట్ల తినదగిన బంగారాన్ని కూడా కలుపుతున్నారు. దీనిని శాస్త్రీయంగా స్వర్ణ భస్మం అని పిలుస్తారు. ఈ స్వీట్లపై ప్రత్యేకంగా బంగారు అలంకరణ కూడా చేస్తారు.

అంజలి జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుకోసం జైన దేవాలయం నుంచి పొందిన ప్రత్యేక బంగారు పనితనాన్ని ఉపయోగిస్తున్నారు. కుంకుమపువ్వు పూత, పైన్ నట్స్ అలంకరణతో ఈ స్వీట్లకు మరింత ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొస్తారు.

ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలలో బంగారం, వెండి వినియోగానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని అంజలి చెబుతున్నారు. అలాంటి అరుదైన సంప్రదాయాలను ఆధునిక పద్ధతుల్లో ప్రజలకు పరిచయం చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని వివరించారు.

ఈ నేపథ్యంలో సాధారణ స్వీట్లకు పూర్తిగా భిన్నంగా బంగారం, వెండి, ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో ఈ ప్రత్యేకమైన స్వీట్లను రూపొందించారు. మొత్తానికి పండగలు వచ్చాయంటే స్వీట్లు కొనడం సహజమే కానీ, జైపూర్‌లోని ఈ షాపులో మాత్రం స్వీట్లు కొనాలంటే మాత్రం కస్టమర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒక్క ముక్క స్వీట్ ధరే వెయ్యి రూపాయలకు పైగా ఉండగా, కిలో కొనాలంటే అక్షరాలా రూ.1.11 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..: AI Humanoid Robots | ఏఐ మాయాజాలం: మార్కెట్ వ్యాపారుల తలపై కెమెరాలు.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *