అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lucky Iron Fish | నెట్టింట ఎక్కడ చూసినా ప్రస్తుతం లక్కీ ఐరన్ ఫిష్ (Lucky Iron Fish) గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఇది రక్తహీనత తగ్గిస్తుందనే ప్రచారమే ఇందుకు కారణం. అయితే, ఐరన్ డెఫిషియన్సీ అనేమియా (రక్తహీనత)తో బాధపడుతున్నవారికి ఇది నిజంగానే ఉపయోగపడుతుందా..? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.
సాధారణంగా చాలామంది ఇళ్లలో వంట కోసం ఇనుప పాన్‌లు లేదా కడాయిలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటికి ఎక్కువ నిర్వహణ అవసరం కావడంతో పాటు బరువు ఎక్కువగా ఉండటం, ఆహారం రంగు, రుచిలో స్వల్పంగా మార్పులు రావడం వంటి కారణాల వల్ల అవి అందరికీ అంత సౌకర్యవంతంగా ఉండవు. ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగానే లక్కీ ఐరన్ ఫిష్‌ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
Lucky Iron Fish | ఎలా పని చేస్తుందంటే?
అసలు లక్కీ ఐరన్ ఫిష్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే.. ఇది మళ్లీ మళ్లీ ఉపయోగించగల ఒక ప్రత్యేకమైన ఇనుప ముక్క. వంట చేసే సమయంలో మరిగే నీటిలో దీన్ని వేయడం ద్వారా ఐరన్ విడుదలవుతుంది.
ముఖ్యంగా ఆ నీటిలో నిమ్మరసం లేదా చింతపండు రసం లాంటి ఆమ్ల గుణం (acidic) ఉన్న పదార్థాలను కలిపితే ఐరన్ మరింత బాగా విడుదలవుతుంది. తయారీదారుల అంచనా ప్రకారం.. దీని ద్వారా సుమారు 6 నుంచి 8 మి.గ్రా. వరకు ఐరన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, దీని నుంచి లభించేది నాన్-హీమ్ ఐరన్ (non-heme iron) కావడం గమనించాలి. ఎంత ఐరన్ విడుదలైనప్పటికీ, ఆ మొత్తం మన శరీరంలోకి పూర్తిగా శోషించదు. దీన్ని విటమిన్ ‘సి’ తో కలిపి తీసుకుంటే శోషణ శాతం కొద్దిగా మెరుగవుతుంది అంతే.
Lucky Iron Fish | అధ్యయన ఫలితాలు ఇవే…
ఈ అంశంపై పలు శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయి. 2017లో 340 మంది మహిళలపై నిర్వహించిన ఒక పరిశోధనలో, 12 నెలల పాటు లక్కీ ఐరన్ ఫిష్‌ను ఉపయోగించినప్పటికీ వారి హిమోగ్లోబిన్ స్థాయిలలో పెద్దగా మెరుగుదల ఏమీ కనిపించలేదు.
అలాగే, 2026 నాటి సిస్టమాటిక్ రివ్యూలో భాగంగా మొత్తం 10 అధ్యయనాలను పరిశీలించగా.. కేవలం 4 అధ్యయనాలలో మాత్రమే హిమోగ్లోబిన్ మెరుగుదల నమోదైంది. మిగతా అధ్యయనాలలో ఎలాంటి స్థిరమైన ప్రయోజనం కనిపించలేదని తేలింది.
Lucky Iron Fish | ఇవన్నీ నమొద్దు…
మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే.. శరీరంలో ఐరన్ లోపం బార్డర్‌లైన్ స్థాయిలో ఉన్నవారికి, అలాగే ఆహారం ద్వారా తక్కువగా ఐరన్ తీసుకునేవారికి ఇది ఒక అదనపు ఐరన్ వనరుగా (additional source of iron) కొంతవరకు సహాయపడుతుంది.
అయితే, ఇది ఐరన్ డెఫిషియన్సీ అనేమియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన చికిత్స కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి కేవలం సోషల్ మీడియా వైరల్ ట్రెండ్స్‌ను చూసి సరైన వైద్య చికిత్సకు బదులుగా వీటిని ఆశ్రయించవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gold Silver Sweets | బంగారం, వెండి చేసే స్వీట్లు.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు