Google Clean Energy | గూగుల్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఏఐ సోలార్ ఏపీఐ విస్తరణ, ఐదు కొత్త క్లైమేట్ ప్రాజెక్ట్‌లు ఇవే!

భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఐదు కీలక పర్యావరణ, క్లైమేట్ టెక్ కార్యక్రమాలను ప్రకటించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Google Clean Energy | భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఐదు కీలక పర్యావరణ, క్లైమేట్ టెక్ కార్యక్రమాలను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జియోస్పేషియల్ డేటా, మౌలిక వసతుల పెట్టుబడులను జోడించి దేశంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇందులో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లతో పాటు, రాజస్థాన్‌లో సోలార్ ఒప్పందం, తెలంగాణలో వరి రైతులకు సంబంధించిన ప్రత్యేక నీటి నిర్వహణ ప్రాజెక్ట్ ఉన్నాయి.

స్థానిక సౌర విద్యుత్ వ్యవస్థాపకులకు రూఫ్‌టాప్ వినియోగాన్ని పెంచడంలో సహాయపడటానికి జియోస్పేషియల్ ఏఐను ఉపయోగించడం నుండి, వాతావరణ అనుకూల నీటి పద్ధతులపై రైతులతో కలిసి పనిచేయడం, జాతీయ గ్రిడ్‌కు కొత్త స్వచ్ఛమైన విద్యుత్‌ను జోడించడం వరకు ఇవన్నీ ఆచరణాత్మక ప్రభావాన్ని చూపుతాయని గూగుల్ క్లైమేట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వృషాలి గౌడ్ తెలిపారు.

Google Clean Energy | సోలార్ ఏపీఐ విస్తరణ..

గూగుల్ ఎర్త్ ఏఐలో భాగమైన ‘సోలార్ ఏపీఐ’ని భారతదేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా భవనాల రూఫ్‌టాప్‌లకు విస్తరిస్తున్నారు. దీనివల్ల ఇళ్లపై సోలార్‌ను ఏర్పాటు చేసే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. సోలార్ లాడర్, ఓపెన్‌సోలార్ వంటి స్థానిక ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఏపీఐని ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిజైన్లను మరింత సులువుగా, తక్కువ ఖర్చుతో రూపొందిస్తున్నాయి. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన వంటి పథకాలకు ఇది మరింత ఊతమివ్వనుంది.

Google Clean Energy |  150 మెగావాట్ల సోలార్ ఒప్పందం..

రాజస్థాన్‌లో కొత్తగా 150 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ కోసం ‘రీన్యూ పవర్’తో గూగుల్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్‌కు సంబంధించిన పర్యావరణ లక్షణాలను గూగుల్ పొంది, తన విస్తృత వాల్యూ చైన్ అంతటా ఉద్గారాలను తగ్గించుకోవడానికి ఉపయోగించనుంది. దీనితో రీన్యూతో కుదిరిన మొత్తం సామర్థ్యం 300 మెగావాట్లకు చేరింది.

తెలంగాణలోని వేలాది మంది సన్నకారు వరి రైతులకు మద్దతుగా ‘మిట్టి ల్యాబ్స్’తో కలిసి గూగుల్ కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. వరి సాగులో వచ్చే మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్’ (AWD) పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. పొలాల్లో నీటిని ఎప్పటికప్పుడు తీసివేయడం ద్వారా మీథేన్‌ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులను అడ్డుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గిస్తారు. నాసా-సహాయక ఉపగ్రహాల ద్వారా దీనిని పర్యవేక్షిస్తారు.

Google Clean Energy | గూగుల్ క్లైమేట్ టెక్ సెంటర్ విస్తరణ..

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయంతో కలిసి ఫిబ్రవరిలో ప్రారంభించిన గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ పరిధిని గూగుల్ విస్తరించింది. భారత ప్రభుత్వ మంథన్ ప్లాట్‌ఫామ్‌పై పరిశోధనల కోసం ‘జల సంరక్షణ’ అలాగే ‘వ్యర్థాలు , వలయాకార వినియోగం’ (ఇ-వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్) అనే రెండు కొత్త ప్రాధాన్యతా రంగాలను చేర్చింది.

గూగుల్ డీప్‌మైండ్ యాక్సిలరేటర్: ఏఐ ఫర్ ది ప్లానెట్ తొలి బ్యాచ్ కింద గ్రహాన్ని రక్షించేందుకు ఏఐని ఉపయోగిస్తున్న నాలుగు స్వదేశీ స్టార్టప్‌లకు మద్దతు అందిస్తున్నారు. టెర్రాస్టాక్, వరాహా క్లైమేట్, ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ , క్లైమిట్రా కార్బన్ వంటి సంస్థలు జియో-ఏఐ, డ్రోన్లు, శాటిలైట్ నమూనాలను ఉపయోగించి పునరుత్పాదక వ్యవసాయం, కార్బన్ క్రెడిట్లు, బయోచార్ తయారీ వంటి రంగాల్లో సేవలు అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *