H1B Visa Fee | ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్.. హెచ్-1బీపై లక్ష డాలర్ల ఫీజు కొట్టివేత

విదేశీ వృత్తి నిపుణుల హెచ1బీ వీసాలకు ట్రంప్ సర్కార్ విధించిన లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమంటూ అమెరికాలోని బోస్టన్ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: H1B Visa Fee | అమెరికా (America) హెచ్-1బీ అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రధానంగా ప్రత్యేక వృత్తుల్లో సాంకేతిక నైపుణ్యమున్న విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవటానికి అక్కడి కంపెనీలను ఇది అనుమతిస్తుంది.

యÖఎస్ ఏటా 65 వేల మందికి ఈ వీసాలను జారీ చేస్తోంది. దీంతోపాటు అక్కడే మాస్టర్స్ చేసిన మరో 20 వేల మందికి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. ఈ వీసాలు పొందినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. రెండో స్థానంలో చైనా ఉంది.

H1B Visa Fee | సమస్య ఎక్కడొచ్చిందంటే..?

విదేశాల్లో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన హెచ్-1బీ లాటరీకి ఎంపికైన అభ్యర్థులు విధిగా లక్ష డాలర్ల ప్రత్యేక రుసుము చెల్లించాలంటూ గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం (Trump Administration) ఉత్తర్వును తీసుకువచ్చింది. అప్పటివరకు ఈ ఫీజు కేవలం 215 డాలర్లుగా ఉండేది. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా కంపెనీలు అమెరికన్లను నియమించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీజును పెంచారు. సాధారణంగా వీసాల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. ఈ స్థాయిలో ఫీజును భరించలేక చాలా కంపెనీలు హెచ్-1బీ నియామకాలను తగ్గించాయి. ఈ ఫీజును సవాల్ చేస్తూ పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయమూర్తి లియో సొరొకిన్.. ట్రంప్ సర్కారు విధించిన ఈ అదనపు రుసుము చట్టబద్ధమైనది కాదని తేల్చి చెప్పారు. పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, కాంగ్రెస్‌కు (అమెరికా పార్లమెంట్)కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

H1B Visa Fee | ఊరట తాత్కాలికమే!

హెచ్-1బీ వీసాలకు ట్రంప్ సర్కార్ విధించిన లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమంటూ కోర్టు తీర్పు ఇవ్వడం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు, కంపెనీలకు సంతోషం కలిగించే విషయమే.. అయితే ఇది తాత్కాలిక ఉరటగా మాత్రమే నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారా ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చట్టపరమైన లొసుగులను వాడుకుని వీసా ప్రక్రియను మరింత కఠినతరం చేసేందుకు వైట్ హౌస్ ప్రయత్నించే అవకాశం ఉందంటున్నారు.

H1B Visa Fee | ఫీజు ఎత్తివేస్తారా..?

కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫీజును పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోస్టన్ కోర్టు (Boston Court) తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేస్తామని వైట్‌హౌస్ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. అదే జరిగితే ఈ అంశం మరికొంత కాలం న్యాయస్థానాల్లో మగ్గనుంది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ సర్కారు అప్పీల్ చేసి గెలిచిన సందర్భాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Apache Helicopter Crash | హర్మూజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ యుద్ధ హెలికాప్టర్.. ఇది ఇరాన్ పనేనా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *