Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Delhi Visit | మాజీ మంత్రి హరీశ్​రావు ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) నేతల కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పునరుద్ధరణ పనులు పరిశీలించిన తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరంపై సీబీఐ (CBI) విచారణ జరపాలని తాము కేంద్రాన్ని డిమాండ్​ చేశామన్నారు. ఇటీవల మరోసారి లేఖ రాశామని సీఎం చెప్పారు. విచారణ చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. దీంతో కేంద్రంలో కదలిక వచ్చిందని సీఎం అన్నారు. ఈ విషయం తెలిసి హరీశ్​రావు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీఆర్​ఎస్​ నేతలు ఢిల్లీకి వెళ్తున్న విషయాన్ని ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. బీజేపీని ప్రసన్నం చేసుకొని సీబీఐ విచారణ తప్పించుకోవడానికి బీఆర్​ఎస్​ చూస్తోందన్నారు.

Harish Rao Delhi Visit | ఎవరిని కలిశారో చెప్పాలి

మాజీ మంత్రి హరీశ్​రావు ఢిల్లీలో ఎవరెవరని కలిశారో చెప్పాలని సీఎం డిమాండ్​ చేశారు. హైకోర్టులో కాళేశ్వరం తీర్పు రిజర్వ్​ అయిందని.. ఈ సమయంలో ఢిల్లీలో న్యాయనిపుణులను కలిసి ఏం చేస్తారన్నారు. ఆ పేరు చెప్పి బీజేపీ నేతలను కలవడానికి హరీశ్​రావు వెళ్లారని ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

Harish Rao Delhi Visit | అంచనాలు పెంచి అవినీతి

వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి (YSR) హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్​ పనులు ప్రారంభించారని రేవంత్​రెడ్డి తెలిపారు. రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ (Hyderabad)​కు తాగునీటి కోసం 160 టీఎంసీల తరలింపు కోసం ప్రాజెక్ట్​ నిర్మాణం చేపట్టారన్నారు. ఈ ప్రాజెక్ట్​ కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఆ తర్వాత నాటి సీఎం కేసీఆర్​ రీడిజైన్​ పేరిట అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ప్రాణహిత – చేవెళ్ల పేరును కాళేశ్వరం ప్రాజెక్ట్​గా మార్చి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజీని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాంతాలకు మార్చారన్నారు. ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెంచారని విమర్శించారు. రూ.35వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచారన్నారు.

Harish Rao Delhi Visit | లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు

కాళేశ్వరం ప్రాజెక్ట్​ భద్రతపై ఎన్​డీఎస్​ఏ (NDSA) బీఆర్​ఎస్​ హయాంలోనే నివేదిక ఇచ్చిందని సీఎం తెలిపారు. ఆ సమయంలో కేసీఆర్​ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. దీనిపై తమ ప్రభుత్వం కమిషన్​ వేసిందని, దాని నివేదిక ఆధారంగా విచారణ చేపట్టాలని సీబీఐని కోరామన్నారు. అయితే 9 నెలలు అవుతున్నా కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయామన్నారు.

ఇన్ని కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్ట్​ను గాలికి వదిలేసే పరిస్థితి లేదన్నారు. దీంతోనే తమ ప్రభుత్వం ప్రాజెక్ట్​ పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు. సాంకేతిక నిపుణులతో తాము ప్రాజెక్ట్​ను పరిశీలించడానికి వెళ్తున్నామని తెలిసి.. బీఆర్​ఎస్​ వాళ్లు సభ పెట్టుకున్నారని విమర్శించారు. ఎక్కడ తమ లోపాలు బయట పడుతాయోననే భయంతో సభ ఏర్పాటు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను పునరుద్ధరించి రైతులకు నీరు అందిస్తామని తెలిపారు.

kaleshwaram

దీనిని కూడా చదవండి : Pharma Reactor Explosion | గడ్డపోతారం పారిశ్రామికవాడలో పేలుడు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *