House Maid Theft | ఇళ్లను దోచేస్తున్న పని మనుషులు.. హైదరాబాద్​ పోలీసుల వార్నింగ్​

హైదరాబాద్​లో పని మనుషులే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. రెండేళ్లలో ఇలాంటి కేసులు 565 నమోదు అయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : House Maid Theft | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఇటీవల దొంగతనాలు పెరిగాయి. ఇళ్లలో పనిచేసేవారే చోరీలకు పాల్పడుతున్న ఘటనలు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నేపాలీ గ్యాంగ్​ (Neapal Gang)లు పని మనుషులుగా చేరి దోపిడీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్​ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

ఇంట్లో పనివారిని పెట్టుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. యజమానులు చూపే నిర్లక్ష్యమే ఈ దొంగతనాలకు ప్రధాన కారణమని తెలిపారు. తగిన విచారణ లేకుండా పనిలో కుదుర్చుకుంటే విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో బిజీగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే విద్యార్థులు, వృద్ధులే లక్ష్యంగా పని మనుషులుగా చేరిన వారు చోరీలు చేస్తున్నారు.

House Maid Theft | అదును చూసి..

ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొంద‌రు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానులు చూపే ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతోందని పోలీసులు పేర్కొన్నారు. చోరీల నివారణకు చర్యలు చేపట్టారుకాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆఫీస్లు, దుకాణాలకు వెళ్లి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేళ్లలో నగరంలో 565 పనిమనుషుల దొంగతనం కేసులు నమోదు అయ్యాయని చెబుతున్నారు.

House Maid Theft | అక్కడే అత్యధికం..

ఐటీ సంస్థలు, వ్యాపార వర్గాలు, ఉన్నత నివాస ప్రాంగణాలు, ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆఫీసుల్లో, దుకాణాల్లో, ఇళ్లలో యజమానులు బిజీ జీవనశైలి కారణంగా ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రెండేళ్లలో జరిగిన 565 చోరీల్లో జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు నమోదు అయ్యాయి. ఇతర దేశాలు, రాష్ట్రాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల అవతారంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్నాయి.

House Maid Theft | ఈ జాగ్రత్తలు పాటించాలి

పని మనుషులను చేర్చుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. వారి ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్​, శాశ్వత చిరునామా, ఫోన్ నంబర్లు సేకరించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు, మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు, సదరు ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని, గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచించారు. పని మనుషులను పెట్టుకునే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉచితంగా లభించే ‘పోలీస్ వెరిఫికేషన్’ చేయించుకోవడం భద్రతా పరంగా శ్రేయస్కరమని తెలిపారు. ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించవద్దని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Karnataka Projects | కర్ణాటక ప్రాజెక్ట్​లతో తెలంగాణకు నష్టం.. బీఆర్​ఎస్​ నాయకుల నిరసన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *