అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka Projects | కర్ణాటక ప్రభుత్వం భీమా నది (Bhima River)పై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలతో తెలంగాణకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ (BRS) నాయకులు అన్నారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులోని భీమా నది గూడూరు బ్యారేజ్ వద్ద భారీ నిరసన చేపట్టారు.
కర్ణాటక నిండింది.. తెలంగాణ ఎండింది అనే నినాదంతో ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలను నిర్మిస్తుంటే రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారే తప్ప వాటిని ఆపే ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా తుంగభద్ర జలాలు తెలంగాణ వైపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Karnataka Projects | ఎండిపోతున్న పంటలు
నీటి కొరతతో ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి నీటి ప్రవాహం నిలిచిపోతే రానున్న యాసంగి సీజన్లో తెలంగాణ రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్ణాటకలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కృష్ణా, భీమా నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్‌డ్యాంల వద్ద వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. మాజీ మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Indiramma House Scams | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండాలన్న సీపీ సజ్జనార్