అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Congestion Charges | రోజురోజుకూ పెరిగిపోతున్న హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నగరంలో ట్రాఫిక్ తగ్గాలంటే అత్యంత రద్దీ ఉండే రహదారులపై ‘కంజెషన్ ఛార్జీలు’ (రద్దీ రుసుము) వసూలు చేయాలని ఓ తాజా అధ్యయనం సూచించింది. ముఖ్యంగా కారులో డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తే జరిమానా లేదా అదనపు ఛార్జీ విధించాలని పేర్కొంది. ఇలా వసూలు చేసిన నిధులను ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్) అభివృద్ధికి వినియోగిస్తే, ప్రయాణ సమయం తగ్గుతుందన్న ఉద్దేశంతో కారు యజమానులు కూడా ఈ రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.
Hyderabad Congestion Charges | సంయుక్త అధ్యయనం..
భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బిట్స్ పిలాని (హైదరాబాద్ క్యాంపస్), కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫహద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. బిట్స్ పిలానిలోని ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ (TRIAL) ప్రొఫెసర్లు ప్రశాంత సాహు, బంధన్ మజుందార్ నాయకత్వంలో ప్రొఫెసర్ డిమిట్రిస్ పోటోగ్లూ, డాక్టర్ నవీద్ మరాజీ ఈ పరిశోధన చేపట్టారు. మొత్తం 435 మంది కారు ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు. ఉద్యోగ కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాలు, మెట్రో జంక్షన్లు, రద్దీ కూడళ్ల సమీప కారిడార్లలో ముందుగా ఈ విధానాన్ని అమలు చేయాలని పరిశోధకులు సూచించారు.
Hyderabad Congestion Charges | కేవలం రోడ్ల వెడల్పుతో..
ట్రాఫిక్ రద్దీకి కేవలం వాహనాల సంఖ్య మాత్రమే కారణం కాదని ప్రొఫెసర్ సాహు అభిప్రాయపడ్డారు. అసమాన రోడ్డు వెడల్పులు, ఫుట్‌పాత్‌లు లేకపోవడం, రోడ్లపై పార్కింగ్, బస్ స్టాప్ల వద్ద ఇబ్బందులు, సరిగా లేని జంక్షన్ల డిజైన్లు కూడా ప్రయాణ ఆలస్యానికి దారితీస్తున్నాయని వివరించారు. అన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయడం కంటే, పదేపదే వాహనాలు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి ‘గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్లు’ నిర్మించాలని అధ్యయనం పేర్కొంది. ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయంతో మరిన్ని బస్సులు, ఫీడర్ సర్వీసులు, మెరుగైన ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తే కాలుష్యం, ఇంధన వృధా తగ్గుతాయని ప్రొఫెసర్ మజుందార్ తెలిపారు.
Hyderabad Congestion Charges | కోటికి చేరువలో గ్రేటర్ వాహనాల సంఖ్య..
హైదరాబాద్, రంగారెడ్డి ( Ranga Reddy ), మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024లో 89.89 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ వాహనాలు 2025 నాటికి 94.78 లక్షలకు చేరాయి. 2026 చివరికల్లా ఈ సంఖ్య కోటి మార్కును తాకుతుందని అంచనా. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్వే ప్రకారం.. హైటెక్ సిటీ ప్రధాన రోడ్డుపై రోజుకు సుమారు 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సైబర్ టవర్స్ వద్ద పీక్ అవర్స్‌లో గంటకు 10 వేలకు పైగా వాహనాలు వెళ్తుండగా, వాటిలో 6,550 కార్లలో డ్రైవర్ ఒక్కరే ఉంటున్నారని, దాదాపు 3,500 వాహనాల్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారని తేలింది.
Hyderabad Congestion Charges | ఐటీ కారిడార్‌లో పైలట్ ప్రాజెక్ట్..
రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయవచ్చని రవాణా నిపుణులు సూచిస్తున్నారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ సైంటిస్ట్ టి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపిక చేసిన కారిడార్లలో హై-ఆక్యుపెన్సీ వెహికల్ (HOV) నిబంధనలు తీసుకురావచ్చని చెప్పారు. పీక్ అవర్స్‌లో ముగ్గురు కంటే తక్కువ మంది ఉన్న కార్లపై ఆంక్షలు లేదా అదనపు రుసుము విధించి, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల సాయంతో చలాన్లు జారీ చేయవచ్చని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా సింగపూర్ ఈ కంజెషన్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయగా, ప్రస్తుతం లండన్, స్టాక్‌హోమ్, మిలాన్, ఓస్లో వంటి నగరాల్లోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోందని నిపుణులు గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Rajiv Gandhi Assassination | రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు