అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Land Protection | మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల జయప్రద కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన 4400 గజాలను హైడ్రా (Hydraa) కాపాడింది. ఇందులో పార్కు కోసం కేటాయించిన 1200 గజాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల కోసం 1200 గజాలు, దేవాలయాలకు ఉద్దేశించిన 400 గజాలు, పాఠశాలతో పాటు గ్రంథాలయానికి కేటాయించిన 800 గజాలు, వాటర్ ట్యాంక్ కోసం కేటాయించిన 800 గజాలు స్థలాలు ఉన్నాయి.
షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన స్థలాన్ని ఇంటి స్థలాలుగా మార్చేయడంతో కాలనీవాసులు హైడ్రా ప్రజవాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా సిబ్బంది ఆక్రమణలు నిజమేనని గుర్తించారు. ఈ మేరకు మంగళవారం ఆక్రమణలు తొలగించి, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు హైడ్రా ఫెన్సింగ్ వేసింది. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ. 25 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
HYDRAA Land Protection | పెద్దచెరువులో ఆక్రమణల తొలగింపు
ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. రామంతాపూర్ (Ramanthapur) పెద్ద చెరువు ఎప్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా.. 16 ఎకరాల వరకూ కబ్జాకు గురైంది. ఇందులో 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు వచ్చాయి. వీటి జోలికి వెళ్లకుండా మరో 4 ఎకరాల మేర తాత్కాలిక షెడ్డులు, గుడిసెలుంటే వారికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరుకు హైడ్రా సిఫారసు చేసింది. ఇలా మొత్తం 18 ఎకరాల మేర చెరువును అభివృద్ధి చేస్తున్న క్రమంలో 1900 గజాల మేర జీ ప్లస్ 2 నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంతో పాటు.. 280 గజాల మేర ఉన్న ఆటో గ్యారేజీని హైడ్రా మంగళవారం తొలగించింది.
దీనిని కూడా చదవండి : HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా..